భలే పాయింట్ చెప్పిన సీఎం రమేశ్

Update: 2016-07-22 09:52 GMT
పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెడతారన్న అపవాదు ఉంది. అలాంటి కోటాలోనే సీఎం రమేశ్ కు రాజ్యసభ సీటును కేటాయించినట్లుగా పలువురు విమర్శిస్తుంటారు. అయితే.. ఏపీ విభజన సందర్భంగా ఆయన తీరును చూసిన తర్వాత.. చాలామంది సీఎం రమేశ్ మీదున్న అభిప్రాయాన్ని కొంత మార్చుకున్న పరిస్థితి. అయితే.. ఆయనకు ఏపీ ప్రయోజనాల కంటే కూడా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించటం స్పష్టంగా కనిపిస్తుంది.

ఏపీకి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో పార్టీ పరంగా తెలుగుదేశం ఎలాంటి ప్రయత్నం చేయనప్పటికీ.. విభజన నిర్ణయంతో ఏపీలో పాతాళానికి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం..హోదాపై  ప్రైవేటుబిల్లును పెట్టి రాజకీయ కాక తీసుకొచ్చింది. ప్రైవేటు బిల్లుతో కాంగ్రెస్ పార్టీకి పడుతున్న మార్కులతో తెలుగు తమ్ముళ్లు ఉక్కిరిబిక్కరి అయ్యే పరిస్థితి. తమకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కవర్ చేస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీని బద్నాం చేస్తూ ఆసక్తికరమైన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు సీఎం రమేశ్.

ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేటు బిల్లుపై కాంగ్రెస్ కు కమిట్ మెంట్ లేదని చెప్పే ఒక ఉదాహరణను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. దీని ద్వారా.. తమను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదన్నట్లుగా సీఎం రమేశ్ వాదన ఉండటం గమనార్హం. ఇంతకీ కాంగ్రెస్ పార్టీకి కమిట్ మెంట్ లేదని చెప్పే అంశం ఏమిటంటే.. ఈ రోజు రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు ఒకటో నెంబరులో ఉండగా.. బీఏసీ (పార్లమెంటు సభా వ్యవహారాల కమిటీ) సమావేశంలో దాన్ని 14వ నెంబరుకు మార్చారని.. అయినప్పటికీ కాంగ్రెస్ నోరు విప్పలేదని చెబుతున్నారు.

ఒకటో నెంబరు నుంచి 14వ నెంబరుకు మారుస్తున్నా అభ్యంతర పెట్టకపోవటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఒకట్రెండు రోజుల ఆలస్యంగా అయినా.. సభలోకి సదరు ప్రైవేటు బిల్లు వస్తుంది కదా? ప్రత్యేక హోదా మీదా ప్రైవేటు బిల్లు పెట్టని తెలుగుదేశంతో పోలిస్తే.. బిల్లు పెట్టి.. ఒకటి నుంచి 14వ స్థానంలోకి షిఫ్ట్ అయితే నోరు విప్పలేదని ప్రశ్నిస్తున్న సీఎం రమేశ్ వాదన వింటే.. ఆయన రాజకీయ కోణం అర్థమై ఉండాలి. ఏపీ ప్రయోజనాల గురించి ఏ పార్టీకి సీరియస్ నెస్ లేకపోవటం సీమాంధ్రులు చేసుకున్న దురదృష్టమేమో..?
Tags:    

Similar News