క్షమాపణలు చెప్పించటానికి ఎంటరైన సీఎం

Update: 2017-06-16 07:35 GMT
విశాఖలో విమానాశ్రయ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యవహారం ముదురుతుండడంతో ఆ పార్టీ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. జేసీపై అయిదు విమానయాన సంస్థలు నిషేధం విధించడంతో పార్టీ జాగ్రత్త పఢింది. ఇది ఇంకా ముదిరి దేశవ్యాప్తంగా తమ పరువు పోకముందే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే జేసీ దివాకరరెడ్డితో క్షమాపణలు చెప్పించాలని పార్టీ నిర్ణయించింది. అయితే.. ఆయన అందుకు ససేమిరా అంటుండడంతో ఆయన్ను బుజ్జగించి క్షమాపణలు చెప్పించేందుకు మరో ఎంపీ రంగంలోకి దిగారు.
    
టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అనంతపురంలోని జేసీ నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు.  జాతీయ స్థాయిలో ఇది పెను వివాదంగా మారకముందే జేసీతో క్షమాపణలు చెప్పించేందుకు ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  ఇంతకుముందు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇలాగే ఎయిర్ లైన్సు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం.. అది రచ్చరచ్చ కావడం తెలిసిందే. దీంతో ఇప్పుడూ అలాగే జరిగి పార్టీ పరువు పోకుండా వారికి క్షమాపణలు చెప్పేయాలంటూ జేసీని సీఎం బుజ్జగిస్తున్నారట.
    
అయితే.. జేసీ మాత్రం తన తప్పేమీ లేదని.. మీడియా తనను గబ్బు పట్టించిందని ఆరోపిస్తున్నారు. మీడియా వల్ల తన   ప్రతిష్ఠను దిగజారిందని ఆయన ఫైరవుతున్నారట. మరి సీఎం రమేశ్ రాయబారం ఫలిస్తుందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News