కర్ణాటక సీఎం ప్రత్యేక పూజలు !

Update: 2019-08-02 10:43 GMT
కర్ణాటక సీఎంగా రెండు రోజుల కిందట ప్రమాణం చేసిన బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌ యడియూరప్ప హైదరాబాద్‌ లో ప్రత్యక్ష మయ్యారు. ఏరాష్ట్రానికి చెందిన సీఎం అయినా అవసరంపై వస్తుండడం సహజమే. అయితే, యడ్డి పర్యటనకు సంబంధించి చాలా ప్రత్యేకతే ఉంది. దీంతో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల కాలంలో సీఎంలుగా ఉన్న వారు ప్రజల కంటే కూడా దేవుడిపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు.

నామినేషన్‌ కు ముందు, తర్వాత, ఎన్నికల రోజుల్లో కూడా వారు ప్రత్యేక పూజలు చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకంగా యజ్ఞాలు, యాగాలు కూడా చేశారు. ఇక, ఏపీ సీఎం జగన్‌ కూడా విశాఖపట్నంలోని స్వరూపానందేంద్ర ఆశ్రమానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇక, కర్ణాటకలో ఇటీవల సంక్షోభం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి ఈ విషయంలో అతిపెద్ద రికార్డునే సొంతం చేసుకున్నారు. ఆయన దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, ఆశ్రమాల్లో తిరిగి తిరిగి మరీ పూజలు చేయించుకున్నారు.

సరే ఏ సీఎంకైనా ఏకైక అంతిమలక్ష్యం సీఎం సీటుకు ఏఢోకా లేకుండా చూసుకోవడమే. ఈ క్రమంలోనే ఇప్పుడు యడియూరప్ప కూడా ఆశ్రమాల బాటపట్టారు. రెండు రోజుల కిందటే ఆయనకర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హైదరాబాద్‌ లోని ముచ్చింతలలో ఉన్నత్రిదండి చినజీయరు స్వామి ఆశ్రమానికి వచ్చారు.గురువారం రాత్రి అక్కడే నిద్ర చేసిన ఆయన శుక్రవారం ఉదయాన్నే తనపేరిట ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడే అందరూ చర్చించుకుంటున్నారు. నిన్నగాక మొన్ననే కదా సీఎం పదవిని చేపట్టారు. ఇంతలోనే ఆయనకు ఏం కోరికలు ఉన్నాయని ప్రతి ఒక్కరికీ సందేహం వస్తుంది.

అయితే, గతంలో మూడు సార్లు ఆయన సీఎంగా పదవి చేపట్టారు. అయితే, ఆ మూడు సార్లు కూడా పూర్తికాలం అంటే 5 ఏళ్లపాటు పాలించే అవకాశం ఆయనకు దక్కలేదు. ఏదో ఒక సమస్య రావడం, అది పెరిగిపోయి.. తన సీటుకే ఎసరు తెచ్చింది. దీంతో ఈ మూడు సార్లు ఆయన మధ్యలోనే వైదొలిగారు.ఇక, ఇప్పుడు కుమార ప్రభుత్వం పడిపోవడంతో చచ్చీ చెడీ ఢిల్లీ పెద్దలను నానా రకాలుగా బ్రతిమాలుకుని యడ్డీ సీఎం సీటు ఎక్కారు. దీంతో ఆయన పూర్తికాలం పదవిలో ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ.. చినజీయర్‌ను ఆశ్రయించారని అంటున్నారు. మొత్తానికి యడ్డీ భక్తి.. బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు.


   
   
   

Tags:    

Similar News