క‌విత‌కు టార్గెట్ అయిపోయిన ద‌త్త‌న్న‌

Update: 2017-07-11 05:43 GMT
కేంద్ర మంత్రి - బీజేపీ సీనియ‌ర్ నేత బండారు ద‌త్తాత్రేయ‌కు సౌమ్యుడైన రాజ‌కీయ‌వేత్త‌గా పేరుంది. త‌న‌ప‌ని తాను చేసుకుపోవ‌డం, వివాదాల‌కు దూరంగా ఉండ‌టం ద‌త్త‌న్న నైజంగా చెప్తుంటారు. అలాంటి ద‌త్త‌న్న తాజాగా టీఆర్ ఎస్ అధినేత - ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె - నిజామాబాద్‌ ఎంపీ కవితకు టార్గెట్ అయ్యారు. ఎందుకంత వ్య‌క్తిగ‌త శత్రుత్వం అనుకోకండి...ప్ర‌జా స‌మ‌స్య‌ల కోణంలోనే కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను క‌విత టార్గెట్ చేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..... సిరిసిల్ల రాజన్న జిల్లాలోని కోరుట్ల - జగిత్యాల పట్టణాల్లో బీడి కార్మికుల కోసం ఈఎస్‌ ఐ ఆసుపత్రులు నిర్మించాలని కోరుతూ ఎంపీ కవిత 2016 డిసెంబర్‌ 29న కేంద్ర మంత్రి దత్తాత్రేయకు లేఖ రాశారు. ఈ లేఖ తమకు అందినట్టుగా ఢిల్లీలోని దత్తాత్రేయ కార్యాలయం నుంచి ఎంపీ కవితకు తిరుగు లేఖ సైతం వచ్చింది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల జ‌గిత్యాల‌లో ప‌ర్య‌టిస్తూన్న ఎంపీ క‌విత‌ ఈఎస్‌ ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం దత్తాత్రేయకు లేఖ రాశానని, ఇప్పటికీ స్పందించనందున ఆయనతో కొట్లాటకు దిగుతానని ప్ర‌క‌టించారు. ఇదిలాఉండ‌గా....క‌విత కామెంట్ల‌ను విలేకరులు దత్తాత్రేయ వద్ద ప్రస్తావించంగా ద‌త్తాత్రేయ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. బీడి కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి విషయంలో కవిత తనకు ఎలాంటి లేఖ రాయలేదని ఆయన చెప్పారు. గతంలో కూడా నిజామాబాద్‌ ఆస్పత్రి గురించి ఆమె ప్రస్తావించడంతోనే.. దాన్ని 50 పడకల ఆస్పత్రిగా మార్చామని చెప్పారు. ఆస్పత్రి విషయంలో కొట్లాట అవసరం లేదని, తన కార్యాలయానికి నేరుగా వచ్చినా.. సమస్య పరిష్కారమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను టీఆర్‌ ఎస్‌ పార్టీ వర్గాలు సీరియస్‌ గా తీసుకున్నాయి. ఎంపీ కవిత రాసిన లేఖ అందినట్టుగా దత్తాత్రేయ కార్యాలయం నుంచి అందిన లేఖను టీఆర్‌ ఎస్‌ వర్గాలు విడుదల చేశాయి. బీడీ కార్మికుల సమస్యలపై తనకు ఎలాంటి లేఖ రాయలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని, అనుమ‌తుల మంజూరులో జాప్యం చేస్తున్న విష‌యాన్ని అంగీక‌రించాల‌ని కోరుతున్నాయి. మొత్తంగా స‌మ‌న్వ‌యలోప‌మో లేదా అధికారుల స‌మాచారం లోప‌మే కానీ టీఆర్ఎస్ వ‌ర్గాల‌కు దత్తాత్రేయ టార్గెట్ అయిపోయారు.
Tags:    

Similar News