షాకింగ్ గా మారిన సంగారెడ్డి క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు

Update: 2017-07-12 06:58 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందే ఉద్య‌మాల పునాదుల మీద‌. ఉద్య‌మం అన్నాక ర్యాలీలు.. నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే స‌వాల‌చ్చ కార్య‌క్ర‌మాలు చేసి.. పెద్ద ఎత్తున త్యాగాలు చేశాక కానీ తెలంగాణ‌రాష్ట్ర స్వప్నం సాకారం కాలేదు. మ‌రి.. అలాంటి ఉద్య‌మ గ‌డ్డ మీద.. ఉద్య‌మ నేప‌థ్య‌మున్న పార్టీ పాల‌న‌లో ఒక జిల్లా క‌లెక్ట‌ర్ జారీ చేసిన ఉత్త‌ర్వ్వులు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

త‌మ డిమాండ్ల సాధ‌న కోసం విద్యార్థులు ర్యాలీలు..నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌టం మామూలే. అయితే.. పాఠ‌శాల హాస్ట‌ల్ విద్యార్థుల‌ను ర్యాలీల‌కు.. ఆందోళ‌న‌ల‌కు.. నిర‌స‌న‌ల‌కు తీసుకెళ్లే విద్యార్థి సంఘాల‌పై కిడ్నాప్ కేసులు న‌మోదు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ మాణిక్క‌రాజ్ క‌న్న‌న్ జారీ చేసిన ఉత్త‌ర్వులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించిన విద్యార్థుల‌కు సంబంధించి ఈ త‌ర‌హా ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం ఏమిట‌న్న  మాట‌ను ప‌లువురు చెబుతున్నారు. అయితే.. క‌లెక్ట‌ర్ మాణిక్క‌రాజ్ ఆలోచ‌న‌లు మ‌రోలా ఉన్నాయ‌ని చెబుతున్నారు. పాఠ‌శాల విద్యార్థుల‌కు అవ‌గాహ‌న త‌క్కువ ఉంటుంద‌ని.. అలాంటి వారిని నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌ల‌కు తీసుకెళ్ల‌టం ద్వారా వారి విద్యా బోధ‌న కు ఆటంకం వాటిల్లుతుంద‌ని.. చ‌దువు దెబ్బ తింటుంద‌ని చెబుతున్నారు.

హాస్ట‌ల్‌.. పాఠ‌శాల విద్యార్థుల‌ను నిర‌స‌న‌ల‌కు.. ర్యాలీల‌కు అనుమ‌తించ‌కుండా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

క‌లెక్ట‌ర్ వాద‌న బాగానే ఉన్నా.. నిర‌స‌న‌ల‌కు తీసుకెళ్లే విద్యార్థి సంఘాల వారిపై కిడ్నాప్ కేసులు పెట్ట‌టం అస్స‌లు బాగోలేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. క‌లెక్ట‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై విద్యార్థి సంఘాలు భ‌గ్గుముంటున్నాయి. పాఠ‌శాల ద‌శ  నుంచే విద్యార్థుల్ని చైత‌న్య‌వంతులుగా చేయాల్సిన అస‌వ‌రం ఉంద‌ని.. ఉద్య‌మ రాష్ట్రంలో నిర‌స‌న‌లపై క‌త్తి క‌ట్టిన రీతిలో నిర్ణ‌యాలు ఏమిట‌ని చెబుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌భూమిక పోషించిన విద్యార్థుల మీద అప్ప‌ట్లో ఇదే రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటే ఎలా ఉండేద‌ని విద్యార్థి సంఘాలు మండిప‌డుతున్నాయి.  

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో చిన్నారులు సైతం ఉద్య‌మ స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించేవార‌ని.. అలాంటి వాటిని చాలామంది పెద్ద‌లు గొప్ప‌గా చెప్పుకునే వార‌ని.. అలాంటిది ఇప్పుడిలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిర‌స‌న ర్యాలీల‌పై కిడ్నాప్ కేసులు బుక్ చేయ‌టం మ‌రీ దారుణ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లా క‌లెక్ట‌ర్ ఇలంటి ఉత్త‌ర్వులు ఎలా ఇస్తార‌ని. . ఉద్య‌మ స‌ర్కారుగా చెప్పుకునే ముఖ్య‌మంత్రి కేసీఆర్ దీనిపై స్పందించాల‌ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Tags:    

Similar News