హిందూపురంలో టీడీపీకి ఓటమి తప్పదా..?

Update: 2019-04-04 16:36 GMT
ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికి అన్ని అంశాలు వైసీపీకి భలేగా కలిసి వస్తున్నాయి. ఇన్నాళ్లు టీడీపీతో కష్టాలు - అవమానాలు భరించిన నాయకులంతా..ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. వస్తూనే వైసీపీలో చేరుతున్నారు. తాజాగా హిందూపురం లోక్ సభ మాజీ సభ్యుడు - ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు కల్నల్ నిజాముద్దీన్ వైఎస్ ఆర్సీపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి - పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు హిందూపురం అసెంబ్లీ పరిధిలోని పలువురు ముస్లిం నాయకులు పార్టీలో చేరడంతో.. హిందూపురంలో వైసీపీ విజయం చాలా సులువు  అయిపోయినట్లేనని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

హిందూపురం నియోజక వర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. ప్రభుత్వాలు మారాయి తప్ప ఇక్కడి నుంచి గెలిచే పార్టీ ఎప్పుడూ టీడీపీనే. కానీ ఈసారి ఎన్నికల్లో అక్కడి ప్రజలు కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. హిందూపురం నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం తర్వాత ఎక్కువమంది  ఉన్న వర్గం ముస్లింలే. అందుకే వైసీపీ హిందూపురం ఎమ్మెల్యే స్థానంలో ఇక్బాల్‌ ని దింపింది. హిందూపురం పార్లమెంట్‌ స్థానానికి కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవని బరిలోకి దించింది.

మరోవైపు హిందూపురం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పపై చాలా వ్యతిరేకత కన్పిస్తుంది. ఇక హిందూపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలయ్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. నియోజకవర్గంలో కనీసం మంచినీటి సమస్యను కూడా తీర్చలేకపోయారు ఆయన. అన్నింటికి మించి బాలయ్య పీఏ చేసిన అక్రమాలను అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు ముస్లిం నాయకులు కూడా వైసీపీలో చేరడంతో.. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం అనే వార్తలు విన్పిస్తున్నాయి.
Tags:    

Similar News