ఇదెక్కడి సంప్రదాయం సారూ.. ఇలా మర్యాద మిస్ అయితే ఎలా?

Update: 2022-04-02 13:31 GMT
మనం ఎన్నైనా అనేయొచ్చు. కానీ.. మనల్ని మాత్రం ఏ ఒక్కరూ అనకూడదన్నట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూసినప్పుడు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో మరే పార్టీ అధినేతకు దక్కని గౌరవ మర్యాదలు కసీఆర్ సొంతం అయ్యాయని చెప్పాలి. ఉద్యమ నాయకుడిగా ఉన్న వేళ.. ఆయన తప్పుల్ని ఎత్తి చూపితే.. ఉద్యమాన్ని కించపరిచినట్లుగా మండిపడేవారు. అయినా తగ్గకపోతే.. తెలంగాణ ఉద్యమ ద్రోహ అన్న ట్యాగ్ వేసేలా గులాబీ దళాన్ని తన ప్రత్యర్థులపై ఊరికించేవారు. దీంతో.. కేసీఆర్ ను ఒక మాట అంటే ఏం ఇబ్బంది ఎదురవుతుందో అన్నట్లుగా ఆయన తీరు ఉండేది.

ఉద్యమం ముగిసి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత ఆయన చేతికి అధికారం రావటం.. తెలంగాణను సాధించిన ఉద్యమ నేతగా అవతరించిన ఆయన్ను పల్లెత్తు మాట అంటే.. తెలంగాణను అవమానించినట్లే అన్నట్లుగా గులాబీ పరివారం తీరు ఉండేది. మొదటి టర్మ్ లో కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయటానికి జంకే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. తీవ్ర ఆరోపణల విషయంలోనూ తొందరపడే పరిస్థితి కనిపించదు.

రెండో టర్మ్ లో మాత్రం కాస్త తేడా వచ్చిందని చెప్పాలి. ఓవైపు రేవంత్ రెడ్డి.. మరో వైపు బండి సంజయ్ తో పాటు.. పలువురు నేతలు కేసీఆర్ మీద విరుచుకుపడటం మొదలు పెట్టటం.. దానికి తగ్గట్లు కౌంటర్లు ఇవ్వటంతోగులాబీ నేతలు కాస్తంత వెనుకబడినట్లుగానే చెప్పాలి. ఇలాంటివి చోటు చేసుకున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన పక్షంలో కేసీఆర్.. తనను తిట్టే వారిని ఉద్దేశించి శాపనార్థాలు పెట్టటంతో పాటు.. కనీస గౌరవ మర్యాదలు లేకుండాపోయాయని విరుచుకుపడేవారు. ‘ఇదెక్కడి దిక్కుమాలిన తీరండి? మరీ.. ఇంత అన్యాయమా? ఇలా బజారు భాష మాట్లాడతారా? గౌరవ స్థానాల్లో ఉన్న వారిని.. ప్రజలు ఎన్నుకున్న వారిని ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మంట పుట్టే వ్యాఖ్యలు చేసేవారు.

ఇదంతా మీడియా ప్రతినిధుల సమక్షంలో జరిగేది. తరచూ అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఎవరైనా ఏమైనా అంటే.. ఆ విషయాల్ని ప్రస్తావించి క్లాస్ పీకేవారు. పెద్ద పదవుల్లో ఉండే వారి విషయంలో ఇలా వ్యవహరించేదా? అని విస్కునేవారు. పెద్దరికం.. గౌరవ మర్యాదల గురించి నీతులు చెబుతూ.. అలాంటివి అర్జెంట్ గా అలవాటు చేసుకోవాలని కోరేవారు. ఇన్ని నీతులు చెప్పే కేసీఆర్.. తన వరకు వచ్చేసరికి వాటినేమీ పాటించని వైనం పై  కనిపిస్తూ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో సానుకూలంగా ఉన్న వేళలో.. ఆయన్ను ఉద్దేశించి ఎవరైనా విమర్శలు చేస్తే.. ఇదే కేసీఆర్ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఆయన దేశ ప్రధాని అని.. అలాంటి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ.. మర్యాదలు ఏమైపోతున్నాయి? అంటూ ఫైర్ అయ్యేవారు.

కరోనా వేళలో గంట కొట్టాలని.. దీపం వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చిన వేళలో.. దాన్ని ఎటకారం చేసిన వేళలోనూ కేసీఆర్ మోడీని దేశ ప్రధానిగా గుర్తు చేస్తూ.. గౌరవ మర్యాదల గురించిప్రస్తావించటం తెలిసిందే. అలాంటి కేసీఆర్.. తన వరకు వచ్చేసరికి మాత్రం ప్రధాని అన్న మర్యాదను మరిచిపోయి విరుచుకుపడటం ఆయనకే చెల్లు. రాజ్యాంగ హోదాలో చూసినప్పుడు తనకంటే పిసరంత ఉన్నత స్థానంలో ఉన్న గవర్నర్ లాంటి వ్యక్తి.. తానే స్వయంగా ఆహ్వానలేఖను పంపి.. రాజ్ భవన్ లో జరిగే ఉగాది ఉత్సవాల్లో పాల్గొనాలని పిలిస్తే.. అక్కడకు కిలో మీటరు దూరం కూడా లేని ప్రగతి భవన్ నుంచి రావటానికి ఆయనకు తీరుబడి కాకపోవటం.. ఆ సమయంలో గౌరవ మర్యాదల గురించి గుర్తుకు రాకపోవటం ఏమిటి?

ప్రోటోకాల్ ప్రకారం.. ఆ వేడుకులకు కచ్ఛితంగా హాజరు కావాల్సిన డీజీపీ.. సీఎస్ లు సైతం డుమ్మా కొట్టటం ద్వారా.. మర్యాదను మిస్ అయ్యేలా ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలే చేయటం దేనికి నిదర్శనం? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. దేశానికి సరికొత్త ఊపును.. ఉత్సాహాన్ని తీసుకురావాలని తపిస్తున్న కేసీఆర్ లాంటి నేతలు అత్యున్నత స్థానాలకు చేరితే.. చిన్నపాటి కోపతాపాలను ప్రదర్శిస్తే దేశం నవ్వుల పాలు కాదా? తాను చెప్పే గౌరవ మర్యాదలన్ని తనకు సానుకూలంగా ఉన్నంతవరకే అన్నది ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.

గవర్నర్ తనకు తానుకాస్తంత తగ్గి మరీ ఆహ్వానించిన ఆహ్వానాన్ని పెద్ద మనసుతో మన్నించి వెళితే.. ఏమవుతుంది? ఒకవేళ తాను వెళ్లటం సరికాదన్నప్పుడు.. తనకు బదులుగా ప్రభుత్వానికి చెందిన వారిని పంపిస్తే సరిపోతుంది  కదా? అలా కాకుండా తాను వెళ్లని చోటుకు తన వాళ్లు ఎవరూ వెళ్లకూడదని అనుకోవటం ఒక ఎత్తు అయితే.. ప్రభుత్వం వద్ద జీతానికి పని చేసే అత్యున్నత స్థాయి అధికారుల్ని సైతం ప్రభావితం చేయటం ఏమేరకు మర్యాద? మరెంత గౌరవం? అన్నది ప్రశ్న. తాజా ఎపిసోడ్ తర్వాత.. గౌరవ మర్యాదల గురించి సీఎం కేసీఆర్ నోటి నుంచి వస్తే ఎబ్బెట్టుగా ఉంటుందన్న విషయాన్నిఆయన గుర్తిస్తే మంచిది. 
Tags:    

Similar News