కమిటీ నివేదిక: స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి కారణం రమేశ్ ఆసుపత్రే?

Update: 2020-08-19 17:30 GMT
ఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 10మంది అసువులు బాసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అగ్నిప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. తాజాగా విచారణ జరిపిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విచారణ కమిటీలో కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, ఎలక్ట్రికల్‌ ఇన్‌ స్పెక్టర్‌ సభ్యులుగా ఉన్నారు.

స్వర్ణప్యాలెస్ ప్రమాదానికి అన్ని రకాల కారణం రమేశ్ ఆసుపత్రియేనని కమిటీ నివేదిక కుండబద్దలు కొట్టింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించించిందని.. వైద్య విలువలను కూడా నీరుగార్చిందని నివేదికలో పేర్కొంది.

ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను రమేశ్ ఆస్పత్రి పట్టించుకోలేదని.. అన్ని అంశాలనూ తెలిసి, ఉద్దేశ పూర్వకంగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు సంపాదించాలనే యావతోనే నియమాలను, చట్టాలను పట్టించుకోలేదని నివేదికలో ఆరోపించారు. 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణం రమేష్‌ ఆస్పత్రేనని నివేదికలో పేర్కొన్నారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను రమేశ్ ఆస్పత్రి ఉల్లంఘించారని రిపోర్టులో పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉన్నవారిని, వీరితోపాటు కోవిడ్‌ సోకని వారిని అంటే నెగెటివ్‌ వచ్చినవారినీ కూడా చేర్చుకున్నారని నివేదికలో వివరించారు.

హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోకుండా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను రమేష్‌ ఆస్పత్రి ఏర్పాటు చేసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ అనుమతి రాకుండానే.. స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారని తెలిపారు. ప్లాస్మా థెరఫీకి ఎలాంటి అనుమతి లేకుండా రమేశ్‌ ఆస్పత్రి నిర్వహించిందని పేర్కొన్నారు. కోవిడ్‌ చికిత్స ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన ‘రెమ్‌డెసివర్‌’ కరోనా డ్రగ్ ను అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారని నివేదికలో తెలిపారు. అగ్రి ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవని నివేదిక నిగ్గుతేల్చింది.
Tags:    

Similar News