ఆంధ్రప్రదేశ్ బంద్ అయ్యింది

Update: 2015-08-11 04:16 GMT
విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా కోసం తిరుపతికి చెందిన కోటి తనను తాను నిప్పు పెట్టుకొని మరణించిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పిలుపునివ్వటం తెలిసిందే.

వామపక్షాలు ఇచ్చిన బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీలు సైతం మద్ధతు పలకటం.. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనటంతో ఏపీ మొత్తంలో బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని డిపోలకే పరిమితం చేయటం.. మరోవైపు రాష్ట్ర లారీ సంఘంతో పాటు పెట్రోల్ బంక్ ల సంఘం.. ఇతర సంఘాల వారు ఏపీకి ప్రత్యేక హోదాకు మద్ధతు ఇవ్వటంతో బంద్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

కొన్నిచోట్ల ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్న చోట వామపక్ష నేతలు అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంలో కొందరు వామపక్ష నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక..  సోమవారం తిరుపతిలో బంద్ నిర్వహించిన నేపథ్యంలో.. ఈ రోజు బంద్ కు తిరుపతి పట్టణాన్ని బంద్ నుంచి మినహాయించారు. తిరుపతి మినహా చిత్తూరు జిల్లా మొత్తం బంద్ నిర్వహిస్తున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తోపాటు.. కోటీ ఆత్మహత్య ఏపీ ప్రజల్ని విపరీతంగా వేధించిందనటానికి నిదర్శనంగా ఏపీలోని వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయటం కనిపించింది. తాజా బంద్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనటం కనిపిస్తోంది.
Tags:    

Similar News