అక్కడ ఇంట్లో నుండి బయటకి వస్తే అంబులెన్స్ ఎక్కాల్సిందే ..!

Update: 2020-04-28 16:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల పూర్తి స్థాయి ఫలితాలు రావ‌డంలేద‌ని భావించిన పోలీసు లాక్‌ డౌన్ ‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ఎటువంటి కారణం లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారికి కరోనా వైరస్‌ వ్యాప్తి వల్ల జరిగే నష్టాలను వివరించడం, కొన్ని సందర్భాల్లో వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టారు. అయినా కూడా ప్రజల్లో పెద్దగా మార్పు రావడంలేదు. బయటకి వస్తే కరోనా వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ఇంటి నుండి బయటకి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు మరో వినూత్న ప్ర‌య‌త్నం చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తిలో వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌ట్ట‌ణంలో 24 గంట‌ల సంపూర్ణ లాక్‌ డౌన్ ప్ర‌క‌టించారు. ఈ ఆంక్ష‌ల‌ను అమ‌లులోకి తీసుకొచ్చి నేటికి ఐదురోజులు పూర్తైంది. ఈ సమయంలో లాక్‌ డౌన్ ఆంక్ష‌ల‌ను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ప్రజలను చైతన్య పరచడానికి బయటకొచ్చిన కొంత మంది యువకులను అంబులెన్స్ లో క్వారంటైన్ కు తరలించే డెమో నిర్వహించారు.

ఇది కేవలం ప్రజలని అప్రమత్తం చేయడానికి మాత్రమే తప్ప .. భయానికి గురిచేయడానికి కాదని పోలీసులు తెలిపారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సరుకుల పంపిణీ జరుగుతోందని, అయితే కొంత మంది ఒకరిద్దరు వంతున బయటకు వస్తూనే ఉన్నారని అలాంటి వారికి జాగ్రత్తలు సూచించడానికి డెమో నిర్వహించినట్లు చెప్పారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి బయటకొచ్చిన వారిపై 150 కేసులు నమోదు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసినట్లు స్థానిక సీఐ తెలిపారు.
Tags:    

Similar News