గెలిచిన వెంట‌నే వేటు వేసేసిన అధినేత్రి

Update: 2017-08-10 04:29 GMT
టెన్ష‌న్ తో చుక్క‌లు చూపించిన పార్టీ నేత‌ల‌పై చర్య‌ల ప‌ర్వాన్ని షురూ చేసింది కాంగ్రెస్ పార్టీ. గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో తోక జాడించిన పార్టీ నేత‌ల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టే కార్య‌క్ర‌మాన్ని వెనువెంట‌నే షురూ చేశారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఒక రాజ్య‌స‌భ స‌భ్యుడ్ని గెలిపించుకునేందుకు పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న‌ప్ప‌టికీ.. కంటి మీద క‌నుకు లేకుండా చేసి.. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ఓట‌మి భ‌యాన్ని క‌లిగించిన ప్ర‌త్య‌ర్థుల్ని ఏమీ చేయ‌లేని కాంగ్రెస్ అధినేత్రి.. వారికి స‌హ‌క‌రించిన త‌మ వాళ్ల‌పై క‌న్నెర్ర చేశారు.

వాస్తవానికి ఇలాంటి స‌మ‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించే కాంగ్రెస్‌.. అందుకు భిన్నంగా తుది ఫ‌లితం వెలువ‌డిన గంట‌ల్లోనూ చ‌ర్య‌ల కొర‌డాను బ‌య‌ట‌కు తీసింది.  పార్టీ విప్ ను ధిక్క‌రించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌ల కార్య‌క్ర‌మాన్ని వెల్ల‌డించింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌పై ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్కొంది. అదే స‌మ‌యంలో మ‌రో ఆరుగురు ఎమ్మెల్యేపై బ‌హిష్క‌ర‌ణ వేటు వేసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

తాజాగా వేటు ప‌డిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలంతా ఇటీవ‌ల పార్టీని వీడిన వాఘేలాకు స‌న్నిహితులే. అదే స‌మ‌యంలో మ‌రో ఆరుగురి మీద కూడా చ‌ర్య‌ల‌కు ప్ర‌య‌త్నాలు షురూచేసిన‌ట్లుగా చెబుతున్నారు. గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజ‌కీయ కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హరించే అహ్మ‌ద్ ప‌టేల్ బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న గెలుపు విష‌యంలో ఆలోచించాల్సిన అవ‌స‌రం లేన‌ప్ప‌టికీ.. మోడీ.. షాలు న‌డిపిన మంత్రాంగంతో కాంగ్రెస్ ఆగ‌మాగ‌మైంద‌ని చెప్పాలి.  ఏం జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ న‌డుమ‌.. అర్థ‌రాత్రి వేళ ఈసీ తీసుకున్న నిర్ణ‌యంతో స‌రిగ్గా ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఓట్ల‌ను సాధించిన అహ్మ‌ద్ ప‌టేల్ గెలిచారు. దీంతో.. కాంగ్రెస్ వ‌ర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ వెంట‌నే తోక జాడించిన పార్టీ ఎమ్మెల్యేల‌పై వేటు వేసే కార్య‌క్ర‌మానికి తెర తీశారు.
Tags:    

Similar News