చిద్దూ భాయ్ రూలింగ్‌!... మోదీది ద్రోహ‌మే!

Update: 2019-03-30 11:21 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల మధ్య వార్ ఆఫ్ వ‌ర్డ్స్ సాగుతున్నాయి. తొలి విడ‌త పోలింగ్‌ కు స‌మ‌యం ఆస‌న్నం కావ‌డం - రెండో ద‌శ నామినేష‌న్ల‌కు తెర లేవ‌డంతో ఇప్పుడు ఆ వార్ ఆఫ్ వ‌ర్డ్స్ మ‌రింత ప‌దెనెక్కాయ‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పై బీజేపీ - బీజేపీపై కాంగ్రెస్ త‌మ‌దైన శైలి విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఎన్నిక‌ల‌కు పూర్తిగా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబ‌రం త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే టార్గెట్ చేసిన చిద్దూ... ఆయ‌న‌ను ఏకంగా ద్రోహిగా అభివ‌ర్ణించేశారు. దేశ ర‌క్ష‌ణకు సంబంధించిన అత్యంత కీల‌క ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టడం - దాని ద్వారా రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని య‌త్నించ‌డం ద్రోహం కాక మ‌రేమిట‌ని కూడా చిద్దూ లాజిక్ తీశారు. చిద్దూ లాజిక్ ను చూస్తుంటే... నిజ‌మేన‌నిపించేలానే ఉన్న ఈ ఆరోప‌ణ‌లపై బీజేపీ ఎలా స్పందిస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింద‌ని చెప్పాలి.

అయినా మోదీని టార్గెట్ చేసిన చిద్దూ భాయ్ ఏమ‌న్నార‌న్న విష‌యాకి వ‌స్తే... *మూర్ఖ ప్రభుత్వాలే దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను బయటపెడతాయి. ఉపగ్రహాలను కూల్చే సత్తాను భారత్‌ చాలా రోజుల క్రితమే సంపాదించింది. తెలివైన ప్రభుత్వాలు ఇలాంటి విషయాలను బయటపెట్టవు. కానీ వెర్రి ప్రభుత్వాలు మాత్రమే దేశ రక్షణకు సంబంధించిన ఇటువంటి అంశాలను బహిర్గతం చేసి - దేశ‌ ద్రోహానికి పాల్పడతాయి* అని చిద్దూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చివేసే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(ఏశాట్‌)ని గురువారం భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించిన సంగతి విదితమే. ఈ విజయంతో ఏశాట్‌ సాంకేతికత కలిగిన అమెరికా - రష్యా - చైనాల సరసన భారత్‌ నిలిచింది. ఈ ప్రయోగానికి మోదీ స‌ర్కారు ‘మిషన్‌ శక్తి’ అని నామకరణం చేసింది.

దీనిపై త‌న వ్యాఖ్య‌ల‌ను కొన‌సాగించిన చిద్దూ... *మిషన్‌ శక్తి ప్రయోగాన్ని ఇప్పుడే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నందున - లాభపడాలనే దుర్బుద్ధితోనే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది* అని మోదీని చిద్దూ ఓ రేంజీలో విమ‌ర్శించారు.  ఇదిలా ఉంటే... ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో మిషన్‌ శక్తి గురించి మోదీ  చేసిన ప్రసంగాన్ని, కోడ్‌ ఉల్లంఘనగా చెప్తూ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ దీనిపై దర్యాప్తునకు ఆదేశిస్తూ, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని వేసింది.  మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత‌టి రాద్ధాంతానికి తెర లేపుతుందో చూడాలి.
Tags:    

Similar News