ఈ ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారా?

Update: 2022-09-11 07:44 GMT
ఒక‌సారి ఎంపీలుగా పోటీ చేసిన‌వారు మ‌రో ఎన్నిక‌లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన‌వారు ఎంపీలుగా పోటీ చేయ‌డ‌మే రివాజే. ఇలా చాలాసార్లు, చాలాచోట్ల జ‌రిగింది. ఇప్పుడు వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఈ సీన్ పున‌రావృతం కానుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ముఖ్య నేత‌లుగా, లోక్‌స‌భ‌ ఎంపీలుగా ఉన్న రేవంత్‌రెడ్డి (మ‌ల్కాజ్‌గిరి ఎంపీ), ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (న‌ల్గొండ ఎంపీ), కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (భువ‌న‌గిరి ఎంపీ) ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌టంతో ఈ ముగ్గురు నేత‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి... కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. హుజూర్ న‌గ‌ర్‌లోనూ, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. న‌ల్గొండ నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, రేవంత్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంటుకు పోటీ చేసి ఘ‌న విజ‌యాలు సాధించారు. పార్ల‌మెంటుకు బ‌ల‌మైన అభ్య‌ర్థులు పోటీ చేయాల‌నే కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ ముఖ్య నేత‌లు అసెంబ్లీతోపాటు పార్ల‌మెంటుకు కూడా పోటీ చేశారు. ఈ వ్యూహం మంచి విజ‌యం సాధించింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ముఖ్య నేత‌లు పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లు కాంగ్రెస్ పార్టీకి చావో రేవోగా మారాయి. 2014, 2018 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా కాంగ్రెస్ అధికారానికి దూర‌మైంది. ఈ ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం కాంగ్రెస్ పార్టీకి త‌ప్ప‌నిసరిగా మారింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉన్న కీల‌క నేత‌లంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఎంపీలు.. ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయడం మామూలే. తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు నేతలు అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సొంత నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతుండడం రాజకీయ వేడిని పెంచుతోంది.

2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొడంగల్‌ నుంచి పోటీ చేసి రేవంత్‌రెడ్డి విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో.. అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డిని పోటీకి దించడంతో పాటు మంత్రి హరీష్‌రావు కొడంగల్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టడం, భారీగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌డంతో రేవంత్‌రెడ్డికి ఓటమి పాల‌య్యారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీచేసిన రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై ఘ‌న‌ విజయం అందుకున్నారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. నియమితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొడంగ‌ల్ లేదా త‌న స్వ‌గ్రామం ఉన్న క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఎంపీ అయినా ఆయన దృష్టంతా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉన్నట్టు చెబుతున్నారు.

అదేవిధంగా ఇప్ప‌టివ‌ర‌కు ఓట‌మి ఎరుగని నేత‌గా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత పార్టీ అధిష్టానం ఆదేశాల‌తో న‌ల్ల‌గొండ ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న హుజూర్ న‌గ‌ర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు.

ఇప్పటికే వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించిన కాంగ్రెస్‌ క్షేత్ర స్థాయిలో బలపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతుండడం.. రాష్ట్రం నలుమూలల విస్తరించి ఉన్న కాంగ్రెస్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీకి పోటీ చేస్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అందుకోవ‌చ్చ‌నే ఆశ‌తోనే రేవంత్ రెడ్డితోపాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆశిస్తున్నార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News