కాంగ్రెస్‌కు నోటాతోనే పోటీ అంట‌!

Update: 2017-12-12 15:30 GMT
దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీగా కాంగ్రెస్‌ను మ‌నం గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పిలుచుకుంటున్నాం. దేశ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఏజ్ ఏ పార్టీకి లేని వైనం కూడా ఆ పార్టీకి ఆ పేరు రావ‌డానికి ఓ కార‌ణంగానూ చెప్పుకోవ‌చ్చు. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా జ‌నం నోళ్ల‌లో నానుతున్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా ఘ‌న‌మేన‌ని చెప్పాలి. ఎందుకంటే దేశాన్ని అత్య‌ధిక కాలం పాలించిన పార్టీగా ఆ పార్టీ త‌న పేరిట నెల‌కొల్పిన రికార్డు ఇప్పుడ‌ప్పుడే బ‌ద్ద‌లు కావ‌డం అంత ఈజీ ఏమీ కాదు. అంతేనా చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రికార్డు ఉంది. ఇక తెలుగు నేల‌పైనా... అత్య‌ధిక కాలం పాటు పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్సే. అయితే అదే స‌మ‌యంలో తెలుగు నేల‌ను రెండు ముక్క‌లు చేసిన పార్టీగా కూడా ఆ పార్టీ ఓ అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకుంద‌నే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని యూపీఏ-2 స‌ర్కారు తీసుకున్న రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యం తెలంగాణ వాసుల‌కు సంతోషాన్నివ్వ‌గా, సీమాంధ్రుల‌ను మాత్రం ఆగ్ర‌హోద‌గ్రుల‌ను చేసేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే త‌మ చిర‌కాల వాంఛ‌ను తీర్చిన పార్టీగా కాంగ్రెస్‌ను తెలంగాణ వాసులు పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

అదే స‌మ‌యంలో త‌మ‌కు తీర‌ని వేద‌న‌ను మిగిల్చిన కాంగ్రెస్‌ను సీమాంధ్రులు మాత్రం దాదాపుగా తిర‌స్క‌రించేశారు. ఫ‌లిత‌మే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల నుంచి ఆ పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగినా ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయారు. విజ‌యం సాధించ‌డం మాట అటుంచితే... పార్టీలో హేమాహేమీలుగా పేరున్న నేత‌ల‌కు క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. ఈ దెబ్బ‌తో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అస‌లు కాంగ్రెస్ పార్టీ నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకే చాలా ఇబ్బంది ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఎలాగోలా బ‌య‌ట‌కు వ‌చ్చిన నేత‌లు... పెద్ద‌గా పొడిచిందేమీ కూడా లేద‌న్న వాద‌న లేకపోలేదు. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌లు జ‌రిగిన ఇప్ప‌టికే నాలుగేళ్లు అవుతోంది. మ‌రో ఏడాది త‌ర్వాత 2019 ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు అటు అధికార పార్టీ టీడీపీ, ఇటు విప‌క్ష పార్టీ వైసీపీ ఇప్ప‌టినుంచే ప‌క్కా వ్యూహాలు ర‌చించుకుని బ‌రిలోకి దిగేశాయి. ఇక అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇప్పుడు ఫుల్  టైమ్ పొలిటీషియ‌న్‌గా మారిపోయిన వైనాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అంతేనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా బ‌రిలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా ఆస‌క్తిక‌రంగానే మారింది.

ఇత‌ర పార్టీల్లో ఇంత జ‌రుగుతున్నా... గ్రాండ్ ఓల్డ్ పార్టీలో మాత్రం ఇప్ప‌టికీ ఎన్నిక‌ల వ్యూహాల ర‌చ‌న మాత్రం మొద‌లుకాలేద‌నే చెప్పాలి. అయినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఏపీలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు దొరికే ఛాన్సే క‌నిపించ‌డం లేదు. సీనియ‌ర్ నేత‌లంగా పార్టీని వీడ‌గా, ఒక్క ర‌ఘువీరారెడ్డి మాత్రం బండిని ఎలాగోలా న‌డిపిస్తున్నారు. అస‌లు ర‌ఘువీరారెడ్డికి అండాదండా ఇచ్చేందుకు స‌రిప‌డినంత మంది నేత‌లు కూడా ఇప్పుడు ఆ పార్టీలో లేర‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా కూడా ఎన్నిక‌ల వ్యూహాల‌పై చ‌ర్చించేందుకు ఆ పార్టీకి కుద‌ర‌డం లేద‌నే చెప్పాలి. మొత్తంగా చూస్తే... ఆ పార్టీ ప్ర‌తిష్ఠ‌ జ‌నాల్లో మ‌రింత‌గా ప‌లుచ‌బ‌డింద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కంటే చాలా త‌క్కువ ఓట్లే వ‌స్తాయ‌ని ఇట్టే చెప్పేయొచ్చు. అంటే నాడు డిపాజిట్లు రాకుంటే... మ‌రి నేడు అంత‌కంటే కూడా త‌గ్గితే... నోటా ఓట్ల‌తో పోటీ ప‌డిన‌ట్టే క‌దా అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఎతావ‌తా జ‌నాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ ఏమిటంటే... వ‌చ్చే ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఖ‌ల్లాస్ ఖాయ‌మేన‌ట‌. చూద్దాం ఏం జ‌రుగుతుందో?
Tags:    

Similar News