మీరు న‌డ‌వ‌డం స‌రే.. కేడ‌ర్‌ను ఎలా న‌డిపిస్తారు?!

Update: 2022-11-20 06:30 GMT
ఏపీలో రెండు కీల‌క పార్టీలు పాద‌యాత్ర‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఒక‌టి టీడీపీ, రెండు కాంగ్రెస్‌. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా పాద‌యాత్ర‌లు చేసేందుకు ఉత్సాహంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27ను మూహూర్తంగా కూడా పెట్టుకున్నారు. ఇక‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సాకే శైల‌జానాథ్ కూడా త్వ‌ర‌లోనే పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని కూడా చెప్పారు. అయితే, అస‌లు వీరు న‌డ‌వ‌డం ఓకే, పార్టీల‌ను ఎలా బ‌లోపేతం చేస్తారు? అనేది ప్ర‌శ్న‌. టీడీపీ విష‌యాన్ని చూస్తే స‌ర్వం ఇప్ప‌టికీ చంద్ర బాబు తీసుకునే నిర్ణ‌యాల‌పైనే పార్టీ ఆధార‌ప‌డి ఉంది. అంతేకాదు, ఒక్కొక్క‌సారి ఆయ‌నే చెబుతున్న‌ట్టు అసలు చంద్ర‌బాబు మాట‌నే కేడ‌ర్ చాలా మంది వినిపించుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారుగా ఉన్నారు.

ఇక‌, ఇప్పుడు లోకేష్ పాద‌యాత్ర చేయ‌డం ద్వారా వ‌చ్చే ప్ర‌త్యేక ల‌బ్ధి ఏంట‌నేది పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌హా అయితే, ఇప్ప‌టి క‌న్నా ఎక్కువ‌గా వైసీపీపై విమ‌ర్శ‌లు చేయొచ్చు. కానీ, కేడ‌ర్‌ను క‌ద‌లించ గ‌ల‌డా?  అది క‌దా అవ‌స‌రం? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇంకా చెప్పాలంటే, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎవ‌రైనా వ‌చ్చి టికెట్ అడిగితే అప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి లోకేష్‌కు లేదు. సో.. ఇది ఆయ‌న‌కు ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణ‌మే.

సో, లోకేష్ పాద‌యాత్ర చేసినా వ‌చ్చే ల‌బ్ధి మాత్రం తూకం వేసుకుంటే తేలిపోయేలా క‌నిపిస్తోంది. ఇక‌, కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే, సేమ్ టు సేమ్ క‌న్నా ఘోరం. అస‌లు ఉన్న‌వారు.. గ‌తంలో ల‌బ్ధి పొందిన వారు పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయారు. అంతేకాదు, అస‌లు పార్టీని ప‌ట్టించుకుంటున్న‌వారు కూడా లేదు. కేవ‌లం ఏదైనా సంద‌ర్భం వ‌స్తే త‌ప్ప‌, ఎవ‌రూ కూడా సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఇదే క‌దా.. అప్ప‌ట్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న ర‌ఘువీరారెడ్డిని నొచ్చుకునేలా చేసింది.

కానీ, ఆయ‌న రాష్ట్ర నేత‌ల‌ను ఏమీ అన‌లేక‌, మౌనంగా త‌ప్పుకొన్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మార్పు లేక‌పోగా, గ్రాఫ్ త‌గ్గుతూ పోతోంది. ఇలాంటి స‌మ‌యంలో సాకే చేస్తాన‌ని చెబుతున్న పాద‌యాత్ర కేవ‌లం.. గ్రామాలూ, ఊళ్లూ చుట్టేస్తూ ప్రచారం దిశ‌గా కాకుండా.. ప్రాభ‌వం దిశ‌గా, నాయ‌కుల‌ను చేర్పించే దిశ‌గా అడుగులు వేస్తేనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News