ఆర్టికల్ 370పై సొంత పార్టీతోనే విభేదిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు

Update: 2019-08-06 08:36 GMT
పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించిన ప్రధానమైన పార్టీ కాంగ్రెస్. కానీ.. ఆ పార్టీలోని సీనియర్లు సహా అనేక మంది నేతలు ఈ విషయంలో సొంత పార్టీతోనే విభేదిస్తున్నారు. కశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకుంటున్న చర్యలను ఓపెన్‌ గా స్వాగతిస్తున్నారు. 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ సవరించిందని.. దాన్నెలా వ్యతిరేకిస్తామని వాదిస్తున్నారు. కొందరైతే దీనిపై బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.. ఇంకొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. నిన్న రాజ్యసభలో ఈ బిల్లు పెట్టినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఓటేయాలని విప్ జారీ చేయాల్సిన ఆ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా.. తాను, ఆ పని చేయలేనంటూ ఏకంగా తన పదవికే రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తుండడానికి అద్దం పడుతుంది.

భువనేశ్వర్ ఒక్కరే కాదు.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జనార్దన్ ద్వివేదీ సైతం ఆర్టికల్ 370 రద్దుకే మద్దతు పలికారు. దేశంలో సమగ్రత కోసం, జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి కోసం అధికరణ 370ని రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక చారిత్రక తప్పిదాన్ని కేంద్రం సరిచేసిందని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు ఇంతటితో ముగింపు లభించిందని అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనప్పటికీ.. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

మరో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ దీపేందర్‌ హూడా సైతం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. దీపిందర్ హుడా హరియానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుదా కుమారుడు. దేశంతో పాటు జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ఈ నిర్ణయంతో ఎంతో మేలు కలుగుతుందని దీపిందర్ అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దంలో ఇంకా అధికరణ 370 చెల్లుబాటు కావడం సమంజసం కాదన్నారు.

వీరే కాదు... సోనియా సొంత నియోజకవర్గం రాయబరేలీ పరిధిలోని రాయబరేలీ సదర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ సైతం బీజేపీ తీసుకున్న చర్యకు మద్దతు పలికారు. యునైటెడ్ వి స్టాండ్.. జై హింద్ అంటూ ఆమె నిన్నే ట్వీట్ చేశారు. వీరే కాకుండా మరో ఇద్దరు సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్ ఈ విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. ముస్లిం ఓట్ల కోసం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించడం చారిత్రక తప్పిదం అవుతుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News