అక్కడ కాంగ్రెస్ వైసీపీ పొత్తు...షాకేనా...?

Update: 2022-04-12 16:03 GMT
ఏ కాంగ్రెస్ పార్టీ మీద అయితే జగన్ దండయాత్ర చేసి వైసీపీని స్థాపించారో అదే కాంగ్రెస్ తో  చేతులు కలుపుతారు అని ఎవరూ అసలు ఊహించరు. అయితే నేరుగా కాదు కానీ కాంగ్రెస్ కార్మిక సంఘంతో వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ పొత్తు పెట్టుకోవడం మాత్రం కొంత చర్చగా షాకింగ్ గా ఉందనే చెప్పాలి.

విశాఖ ఉక్కు కర్మాగారంలో గుర్తింపు యూనియన్ ఎన్నికలను ఈ నెల 23న నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార కార్మిక సంఘంగా నిలిచేందుకు, గెలిచేందుకు చాలా యూనియన్లు పోటీ పడుతున్నాయి. కార్మిక సంఘాల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ లాంటివి ముందుటాయి.

ఇక కాంగ్రెస్ కార్మిక సంఘం ఇంటాక్ కూడా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ గా గెలిచింది. దాంతో ఈసారి ఇంటాక్ కూడా పోటీలో ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇంటాక్ కి మద్దతు ఇస్తోంది. అంటే కాంగ్రెస్ కార్మిక సంఘం ఇక్కడ గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ కార్మిక సంఘం గట్టిగా కోరుకుంటోంది అన్న మాట.

తాము ఉక్కు కార్మిక సంఘం ఎన్నికల్లో ఇంటాక్ తో కలసి పనిచేస్తామని స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ కాంగ్రెస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప ప్రకటించారు. సాధారణంగా ఇక్కడ కార్మిక సంఘాలకు రాజకీయ నేపధ్యం ఉన్నా ప్రధానంగా అవి కార్మిక శ్రేయస్సుతోనే పనిచేస్తాయి. కాబట్టి ప్రతీ ఎన్నికకూ పొత్తులు మారుతూ ఉంటాయి.

అలా కనుక చూసుకుంటే మిగిలిన కార్మిక సంఘాలను నిలువరించేందుకు ఇంటాక్ తో వైసీపీ  పొత్తుని ఎత్తుగడగా చూడవచ్చు. కానీ నిజానికి ఇంటాక్ అంటేనే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం, దాని జాతీయ నాయకుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ సంజీవరెడ్డి అని అందరికీ తెలుసు. దాంతోనే ఈ చర్చ వస్తోంది. ఏది ఏమైనా కార్మిక సంఘాల వరకూ ఇది ఎత్తుగడగా ఉన్నా అక్కడ కాంగ్రెస్, వైసీపీ ఒక్కటయ్యాయి అన్న వార్తలు మాత్రం చిత్రంగానే అంతా చూసేలా వినేలా ఉన్నాయి.
Tags:    

Similar News