అమరావతి నిర్మాణానికి ఐదేళ్లు కావాలి: హైకోర్టులో జగన్ ప్రభుత్వం అఫిడవిట్!

Update: 2022-06-09 04:50 GMT
ప్రతిపక్ష పార్టీలు, అమరావతి రాజధాని రైతులు ఊహించినట్టే జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి తమకు ఐదేళ్లు సమయం కావాలని తెలిపింది. ఇప్పుడున్న నగరాలు, రాజధానుల అభివృద్ధికి 40-50 ఏళ్లు పట్టిందని వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానిగా అమరావతే ఉంటుందని.. జగన్ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) రద్దు బిల్లు చెల్లవని గతంలో హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా అమరావతిలో ఆరు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని నాడు హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే రాజధాని భూసేకరణకు భూములిచ్చిన రైతులకు మూడు నెలల్లోగా అన్ని మౌలిక వసతులతో ప్లాట్లు అప్పగించాలని సూచించింది. అదేవిధంగా పనులు ఎక్కడిదాకా వచ్చాయో ఎప్పటికప్పుడు తమకు అఫిడవిట్ల రూపంలో తెలియజేయాలని కోరింది.

ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలపైన అఫిడవిట్ లో వివరణ ఇచ్చింది. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తగిన మౌలిక వసతులతో ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించడానికి తమకు ఐదేళ్ల సమయం కావాలని తెలిపింది. రాజధాని నిర్మాణం వెంటనే పూర్తయ్యేది కాదని.. ఎంతో సమయం పట్టే సుదీర్ఘ అంశమని వివరించింది. రాజధాని నగరంలో మాత్రమే మౌలిక వసతులను అభివృద్ధి చేయగలమని.. ఇందుకు ప్రభుత్వానికి, సీఆర్డీఏకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు అఫిడవిట్ లో జగన్ ప్రభుత్వం విన్నవించింది. కాబట్టి తమకు విధించిన గడువును పెంచాలని అభ్యర్థించింది.

రాజధాని నిర్మాణం కోసం తమ భూములిచ్చిన రైతులకు 63,452 ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని జగన్ ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో వివిధ కారణాలతో 21,567 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో ఉందని వివరించింది. ఇప్పటివరకు 41,885 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేశామని హైకోర్టుకు నివేదించింది. భూసేకరణ వివాదం వల్ల 3,289 ప్లాట్లను కేటాయించడం గానీ, రిజిస్టర్‌ చేయడం గానీ చేయలేదని వివరణ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉన్నవాటిగా తేల్చామని.. ఇందులో 709 ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశామని కోర్టుకు నివేదించింది.

రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులకు ఆయా బ్యాంకులతో చర్చిస్తున్నామని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. రాజధాని నిర్మాణం కాబట్టి చాలా భారీగా నిధులు అవసరమని గుర్తు చేసింది. అంత పెద్ద మొత్తాన్ని ఒకే బ్యాంకు కూడా ఇవ్వలేదని.. అందుకే బ్యాంకుల కన్సార్టియం అవసరం ఉందని వెల్లడించింది. నిధులు లభ్యమయ్యాక మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొంది. ఆ తర్వాత దశలవారీగా రైతులకు ప్లాట్లను అప్పగిస్తామని కోర్టుకు నివేదించింది.

ఈ నేపథ్యంలో సవరించిన విధానంతో రూ.3,500 కోట్లకు తాజాగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వాన్ని బ్యాంకర్లు కోరాయని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులకోసం భూములను, ప్లాట్లను వేలం వేయడానికి సీఆర్‌డీఏ ప్రయత్నిస్తూనే ఉందని తెలిపింది. కాగా రూ.33.51 కోట్లతో హైకోర్టు అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్‌ ఇండియా సర్వీసు అధికారుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు ఎన్‌సీసీ సంస్థకు ఈ ఏడాది నవంబర్ 30 వరకు గడువును పొడిగించామని తెలిపింది. అలాగే సింగిల్ లైన్ రోడ్డుగా ఉన్న కరకట్ట రోడ్డును విస్తరించి డబుల్ లైను రోడ్డుగా నిర్మిస్తున్నామని కోర్టుకు నివేదించింది.
Tags:    

Similar News