అయోధ్య ఆలయ నిర్మాణం.. మరో వివాదం

Update: 2021-06-15 14:30 GMT
ఎన్నో ఏళ్ల తర్వాత అడ్డంకులన్నీ దాటి అయోధ్యలో శ్రీరామాలయ నిర్మాణం జోరుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా భక్తులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, నేతలు ఇచ్చిన విరాళాలతో ఈ భారీ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది.

తాజాగా అయోధ్య ఆలయ భూమి కొనుగోలు వ్యవహారం వివాదాస్పదమైందని తెలిసింది. ఆలయానికి భూమి కొనుగోలు అంశంలో కొందరి చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి. గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయల ధరను పెంచారని.. భారీ ధరకు ఆలయనిర్మాణ ట్రస్టు కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని మరో వివాదం వెలుగుచూసింది. ఇదో స్కాం అంటూ మీడియాలో ఆరోపణలు రావడం దుమారం రేపింది.

ఈ ఏడాది మార్చి 18న 1200 చదరపు అడుగుల భూమిని రవిపాటక్ అనే వ్యక్తి రవి, అన్సారీ అనే ఇద్దరికీ 2.50 కోట్లకు అమ్మారని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కొన్ని నిమిషాల తర్వాతే ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అదే భూమిని ఏకంగా 18.5 కోట్ల రూపాయలకు అమ్మారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిమిషాల వ్యవధిలో ఆ భూమి ధర అంత పెంచారా? ఇదో పెద్ద స్కాం అంటూ మీడియా, ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పుడు బీజేపీ నేతల హస్తముందని ఆరోపిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై అయోధ్య ట్రస్ట్ స్పందించలేదు. ఇక బీజేపీ నేతలు కూడా ఈ వివాదంపై మాట్లాడలేదు. ట్రస్ట్ కు తెలిసి ఈ విక్రయం జరిగిందా? అమ్మిన వారు మోసం చేశారా? అసలు ఈ వివాదానికి కారణం ఏంటన్నదానిపై అసలు నిజాలు తెలియాల్సి ఉంది. అప్పటివరకు ఈ ఆరోపణలకు కారణం అయోధ్య ట్రస్ట్ అన్నదానికి ఆధారాలు ఏమీ లేవు.

దీనిపై కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయోధ్య ఆలయ నిర్మాణం వివాదాస్పద కాకుండా చేయాలని వారు కోరినట్టు సమాచారం.
Tags:    

Similar News