పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్ట‌ర్ బ‌ర్త్ డే వేడుక‌లా?

Update: 2019-05-06 12:09 GMT
తెలంగాణ‌లో ఇప్పుడు అన్నీ వ్య‌వ‌స్థ‌లు రివ‌ర్స్ లోనే సాగుతున్నాయని చెప్ప‌క త‌ప్ప‌దేమో. జ‌వాబుదారీ త‌నం అడ్రెస్ క‌నిపించ‌డ‌మే మానేసింద‌న్ వాద‌న వినిపిస్తోంది. ప్ర‌భుత్వం స‌దుద్దేశంతో చేసిన కొన్ని చ‌ర్య‌ల‌ను అధికారులు ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నారు. అయినా కూడా వారిపై చ‌ర్య‌ల మాట అలా ఉంచితే.. అస‌లు ఇలా ఎందుకు చేశార‌ని అడిగే నాథుడే క‌రువ‌య్యాడ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం అన్న రీతిలో ఓ ఘ‌ట‌న ఇప్పుడు వెలుగు చూసింది. త‌ప్పు చేసే వ్య‌క్తులకు అర‌దండాలేసే ఠాణాలు... అదేనండీ పోలీస్ స్టేష‌న్లు... బ‌డా బాబుల బ‌ర్త్ డే వేడుక‌ల‌కు వేదిక‌లుగా మారిపోయిన ఈ విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ గా మారిపోయింది.

ఈ ఘ‌ట‌న పూర్వ‌ప‌రాల్లోకి వెళితే... కరీంనగర్ లోని మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టినరోజు ఇటీవల జరిగింది. దీంతో సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆయన పుట్టినరోజు వేడుకలను స్టేషన్ లోనే ఏర్పాటు చేశారు. కేక్ తెప్పించి ఆయ‌న‌చేత కోయించి ఆయ‌న‌కు తినిపించి సంద‌డి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత తొలి స‌ర్కారును ఏర్పాటు చేసిన టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ స‌రికొత్త ప‌దాన్ని వాడారు.

అప్ప‌టిదాకా అర‌కొర వ‌స‌తుల‌తో ఉన్ పోలీస్ స్టేష‌న్లు అన్నీ స‌క‌ల హంగుల‌తో ఏర్పాట‌య్యాయి. క‌ద‌ల‌డానికే ఇబ్బంది ప‌డుతున్న డొక్కు వాహ‌నాల స్థానంలో ఇన్నోవా వాహ‌నాలు వ‌చ్చి చేరాయి. అందులో ఏసీ సౌక‌ర్యం కూడా అందుబాటులోకి వ‌చ్చింది. అన్ని హంగులు అమ‌ర్చాం క‌దా... ఇక ప్ర‌జ‌ల‌తో స్నేహంగా మెల‌గి నేరాల నివార‌ణ‌కు ప‌నిచేయండి అంటూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప‌దానికే మ‌చ్చ  తెచ్చేలా ఇప్పుడు మాన‌కొండూరు ఘ‌ట‌న నిలుస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News