అన్నాడీఎంకేలో వివాదానికి మూల కారణమిదేనా ?

Update: 2022-07-13 11:30 GMT
అన్నాడీఎంకేలో ఇద్దరు అగ్రనేతల మధ్య వివాదం తారాస్ధాయికి చేరుకున్నది. మాజీ ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి మరో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కోశాధికారి ఓ పన్నీర్ శెల్వంను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించేశారు. అయితే తనపై బహిష్కరణ వేటు చెల్లదంటు పన్నీర్ కోర్టులో కేసువేశారు. కాబట్టి కోర్టులో ఈ వివాదం ఎప్పటికి తేలుతుందో ఎవరు చెప్పలేరు. అయితే అసలు వీళ్ళద్దరి మధ్య వివాదం ఎందుకింతగా పెరిగిపోయింది ?

విచిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్నంతకాలం ఏదోపద్దతిలో సఖ్యతగానే ఉన్నారు. ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత గొడవలు పెరిగిపోయి పన్నీర్ ను బహిష్కరణకు దారితీసింది. పన్నీర్ ను పార్టీ నుంచి బహష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే నిధులే అసలు కారణంగా తెలుస్తోంది. పార్టీకి కరూర్ వైశ్యాబ్యాంకు, ఇండియన్ బ్యాంకుల్లో రు. 300 కోట్ల డిపాజిట్లున్నాయట. కోశాధికారి హోదాలో మొన్నటివరకు పన్నీర్ ఇష్టారీతిలో వ్యవహరించారని సమాచారం.

ఆ విషయం తెలిసి బ్యాంకు ఖాతాలపై తనే ఆధిపత్యం వహించాలని పళనిస్వామి ఆలోచించారట. పన్నీర్ కోశాధికారిగా ఉండగా ఆయన పెత్తనం సాగదు. అందుకనే ముందు పన్నీర్ ను పార్టీకి దూరంచేయాలని డిసైడ్ అయ్యారట.

ఈ నేపధ్యంలోనే ఏదో కారణాలు చెప్పి పన్నీర్ ను బాగా రెచ్చగొట్టి గొడవలకుదిగేట్లు కవ్వించారు. చివరకు ఇద్దరి మధ్య గొడవలు జరిగి పెద్దవైపోయిన తర్వాత హఠాత్తుగా పన్నీర్ పార్టీ క్రమశిక్షణ తప్పారనే కారణంగా ఏకంగా బహిష్కరించేశారు.

వెంటనే పన్నీర్ ను బహిష్కరించిన విషయం బ్యాంకులకు, కేంద్ర ఎన్నికల కమీషన్ కు కూడా చెప్పేశారు. తమ అనుమతి లేకుండా ఎవరు బ్యాంకుల్లో నుండి డబ్బు డ్రా చేసేందుకు లేదని పళనిస్వామి బ్యాంకులకు లేఖలు రాశారు.

పన్నీర్ కూడా తాను కోర్టులో కేసు విషయాన్ని వివరిస్తూ, పళని రాసిన లేఖలు చెల్లవని బ్యాంకులకు లేఖలు రాశారు. దాంతో ఇద్దరిలో ఎవరిమాట వినాలో అర్ధంకాక బ్యాంకులు బుర్రలు గోక్కుంటున్నాయి. ఇద్దరి మధ్య గొడవలకు అసలు కారణం ఈ రు. 300 కోట్లే అని అర్ధమైపోతోంది.
Tags:    

Similar News