శ్రామిక్ ఎక్స్ ప్రెస్ పై ఈ రచ్చ విన్నారా మోదీ గారు?

Update: 2020-05-04 01:30 GMT
క‌రోనా క‌ల‌క‌లం కార‌ణంగా ప్ర‌భావితం కాని రంగం అంటూ లేదు. ముఖ్యంగా పేద వారి బ‌తుకులు చిన్నాభిన్నం అయిపోయాయి. లాక్‌ డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రదేశాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల ప‌రిస్థితి అయితే మ‌రింత దారుణం. అనేక రోజుల పాటు వారి ఆవేద‌న కొన‌సాగించిన అనంత‌రం...సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ లను నడుపుతోంది. అయితే, శ్రామికుల విష‌యంలో మోదీ స‌ర్కారు ఇదే స‌మ‌యంలో చేసిన చ‌ర్య చ‌ర్చ‌కు దారితీస్తోంది.

రైల్వే శాఖ ఆధ్వ‌ర్యంలో కేవలం కూలీలను తరలించేందుకు వీటిని ఏర్పాటు చేసింది. బస్సులు ఏర్పాటు చేసేందుకు వీలు లేని ప్రాంతాల నుంచి రైళ్లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన నేపథ్యంలో రైల్వే శాఖ స్పెషల్‌ ట్రైన్స్‌ వేసింది. రైళ్లలో సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ఉత్తర్‌‌ ప్రదేశ్‌ - తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక - తెలంగాణ - కేరళ - రాజస్థాన్‌ - మహారాష్ట్ర - జార్ఖండ్‌ - గుజరాత్‌ రాష్ట్రాలు కూలీలను తీసుకొచ్చేందుకు రైళ్లు కావాలని కోర‌డంతో రైల్వే శాఖ ‘శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో వీటిని స్టార్ట్‌ చేసింది. అయితే, ఇందులో క‌నీస చార్జీ పేరుతో రూ.50 వ‌సూలు చేసింది. ఈ చార్జీపై దుమారం రేగుతోంది.

మ‌రోవైపు రుణాలు తీసుకుని ఎగవేసిన టాప్‌-50 కార్పొరేట్ల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా వదిలించుకున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 30 వరకు రూ.68,607 కోట్ల కార్పొరేట్‌ రుణ బకాయిలను దేశీయంగా బ్యాంకులు రద్దు చేశాయి. వీటిలో మెహుల్‌ చోక్సీ - విజయ్‌ మాల్యాకు చెందిన సంస్థలతో పాటు ఇతర సంస్థల బాకీలున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ వివరాల తెలిపింది.

ఈ రెండు ఉదంతాల‌ను పోల్చుతూ  నెట్టింజ ప‌లువురు కేంద్రం తీరును ప్ర‌శ్నిస్తున్నారు. వేల కోట్ల రూపాయ‌లు లోన్లు తీసుకొని ప్ర‌జాధ‌నంతో అక్ర‌మాల‌కు పాల్పిడిన వారికి వాటిని చిన్న ప్ర‌క్రియ‌ల ద్వారా అప్పులు మాఫీ చేసిన పాల‌కులు.. పొట్ట కూటి కోసం ఊరు కాని ఊరు పోయి రోజు కూలీకి ప‌ని చేసుకుంటున్న వారి నుంచి మాత్రం ముక్కుపిండి లాక్ డౌన్ స‌మ‌యంలో టికెట్‌ కు రూ.50 చొప్పున వ‌సూలు చేయ‌డం ఎంత‌వర‌‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ స‌ర్కారు అటు వేల కోట్ల మాఫీ చేయ‌డం ద్వారా ఇర‌కాటంలో ప‌డ్డ కంటే...ఈ కార్మికుల నుంచి వ‌సూలు చేయ‌డం ద్వారా టార్గెట్‌ అయింది ఎక్కువ‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News