కాన్వాయ్ ఆపి మరీ సామాన్యుడికి సారు షేక్ హ్యాండ్

Update: 2020-02-28 05:00 GMT
నాటకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. అయితే ప్రగతిభవన్.. లేదంటే ఫామ్ హౌస్ లోనే తప్పించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బయట పెద్దగా కనిపించరన్న అపవాదు వినిపిస్తుంటుంది. అయితే.. తాను కాలు బయటకు పెట్టిన ప్రతిసారీ తనదైన్ మార్క్  ప్రదర్శిస్తూ.. తానెప్పుడూ అందుబాటు లో లేనన్న భావనను అధిగమిస్తుంటారు సీఎం కేసీఆర్. తాజాగా మరోసారి అలాంటి పనే చేసిన ఆయన.. సారుది ఎంత పెద్ద మనసో అన్న భావన కలిగించటం లో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.

హైదరాబాద్ లోని టౌలిచౌకీలో జరిగిన ఒక ప్రైవేటు ప్రొగ్రాంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ కు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు మీద ఒక పెద్ద వ్యక్తి.. చేతిలో వినతిపత్రం పట్టుకొని నిలబడినట్లు సీఎంకు కనిపించింది. అంతే.. అంతపెద్ద కేసీఆర్ తన కాన్వాయ్ ను ఆపేశారు. తానే స్వయంగా కారు దిగా ఆయన దగ్గరకు వెళ్లాడు.

అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పేరు మహ్మద్ సలీమ్ అని.. గతంలో తాను డ్రైవర్ గా పని చేసేవాడినని.. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నానని ఆయన వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్ పై నుంచి పడటం తో కాలు విరిగిందని.. తన కుమారుడి ఆరోగ్యం బాగోలేదన్నారు. ఉండటానికి తగిన ఇల్లు లేదని.. సాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ అక్కడికక్కడే ఆయనకు సాయం అందించాల్సిన వైనాన్ని అధికారుల్ని ఆదేశించారు.

సలీమ్ సమస్యల్ని పరిష్కరించాలని.. వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఆమె నేరుగా సలీమ్ ఇంటికి వెళ్లి విచారించారు. వికలాంగుడన్న విషయాన్ని ధ్రువీకరించటమే కాదు.. అప్పటికప్పుడే పెన్షన్ మంజూరు చేశారు. ఫిబ్రవరి ఫించన్ కింద రూ.3,016 మొత్తాన్ని అందజేశారు. జియాగూడలో డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. ప్రభుత్వ ఖర్చులతో వైద్య పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందిస్తామన్నాని చెప్పారు. ఏమైనా.. సారు కంట్లో పడితే చాలు.. సమస్యల సాగరంలో ఈదుతున్న జీవితం ఒక్కసారి కుదుట పడటం ఖాయమన్న మాట మరోసారి ఫ్రూవ్ అయినట్లేనని చెప్పకతప్పదు.
Tags:    

Similar News