ప్రచారం నుంచి తప్పించుకోవడానికి అలక ఐడియా?

Update: 2022-08-23 09:30 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రచ్చ మామూలుగా లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నాడని, తన మద్దతుదారులతో తనను తిట్టిస్తున్నాడంటు మళ్ళీ పాతపాటనే అందుకున్నారు. రేవంత్ మీద ఫిర్యాదు చేస్తూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పెద్ద లేఖనే రాశారు.

నిజానికి ఎంపీ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ పాతపడిపోయినవే. తనకు చెప్పకుండానే మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో బహిరంగసభ నిర్వహించారని, సభలో తనను తిట్టించారని ఆరోపించారు.

సమావేశాల విషయమై తనకు సమాచారం అందించటం లేదంటు సోదంతా చెప్పుకున్నారు. కాబట్టి తాను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని చెప్పేశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎంపీకి స్వయానా తమ్ముడు. తమ్ముడికి మద్దతుగా నిలబడితే పార్టీలో పరువుపోతుంది. ఇదే సమయంలో పార్టీ అభ్యర్ధికోసం గట్టిగా పనిచేస్తే తమ్ముడు ఓడిపోవటం ఖాయం. ఈ రెండు సమస్యల మధ్య ఎంపీ నలిగిపోతున్నారు.

తమ్ముడి ఓటమి ఎలాగున్నా పార్టీ అభ్యర్ధి కోసం పనిచేయకపోతే పరువుపోతుందని, వ్యతిరేకులంతా కలిసి అన్ని వైపుల నుండి తనను వాయించేస్తారని ఎంపీగా బాగా తెలుసు. ఎలాగూ తమ్ముడికి వ్యతిరేకంగా పనిచేయలేరు. అందుకనే ఈ సమస్యలో నుండి బయటపడేందుకు ఎంపీ మధ్యేమార్గాన్ని ఎంచుకున్ ట్లున్నారు.

అదేమిటంటే తనను అవమానిస్తున్నారని, పార్టీలో నుండి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు కాబట్టి తానేదో అలిగినట్లు, ఉప ఎన్నిక బాధ్యతలనుండి తప్పుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు.

తిట్టారని, తిట్టించారనే ఆరోపణలపై రేవంత్ గతంలోనే ఎంపీకి సారీ కూడా చెప్పారు. అయినా కూడా ఎంపీ నానా రచ్చ చేస్తున్నారు. ఈయన వరస చూస్తుంటే కావాలనే గోల చేస్తున్నారని అందరికీ తెలిసిపోతోంది. ఉపఎన్నికల్లో కీలకమని భావించిన 8 మంది నేతలను భేటీకి పిలిస్తే ఢిల్లీకి వెళ్ళిన ఎంపీ భేటీలో పాల్గొనకుండానే తిరిగి వచ్చేశారంటేనే విషయం అర్ధమైపోతోంది. ముందు ముందు ఇంకెంత రచ్చ చేస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News