ఎస్ ఐ ఉద్యోగాన్ని ఊడగొట్టిన సోషల్ మీడియా

Update: 2015-09-20 12:32 GMT
బాధ్యతగా వ్యవహరించాల్సిన స్థానాల్లో ఉన్న వారు బలుపుతో వ్యవహరిస్తే.. షాకివ్వటానికి సోషల్ మీడియా సిద్ధంగా ఉందన్న విషయం మరోసారి రుజువైంది. చేతిలో ఉన్న పవర్ తో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారి విషయంలో సోషల్ మీడియా చెక్ చెప్పేస్తుందన్న విషయం మరోసారి రుజువైంది. అధికారం ఉందన్న అహంయారంతో ఒక సీనియర్ సిటిజన్ మీద ఓవరాక్షన్ ప్రదర్శించిన ఎస్ ఐ ఉద్యోగం ఊడింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూపీలోని లక్నో నగరంలోని జనరల్ పోస్టాఫీసు ఎదురుగా ఫుట్ పాత్ మీద కనిపించే సీనియర్ సిటిజన్ పేరు తెలీకున్నా.. అటువైపు వెళ్లే ప్రతిఒక్కరికి ఆయనకు సుపరిచితుడు. ఇక.. పోస్టాఫీసుకు వచ్చే వారికైతే ఆయన బాగానే తెలుసు.

ఎందుకంటే.. దాదాపు 35 ఏళ్లుగా ఆయన అదే ప్రాంతంలో పుట్ పాత్ మీద కూర్చొని తనదగ్గరున్న డొక్కు టైప్ రైటర్ తో పని చేసుకుంటూ ఉంటాడు. టైప్ రైటర్లు పోయి.. కంప్యూటర్లు వచ్చేసినా ఆయన మాత్రం తన పాత టైప్ రైటర్ తో పనులు చేస్తూ.. బతుకు బండి లాగుతుండే ఆయన పేరు కృష్ణకుమార్. వయసు 65 ఏళ్లు. రోజుకు రూ.50 మాత్రమే సంపాదించే ఆయన.. ఆ వచ్చే కొద్ది మొత్తం కోసం రోజంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. తన వద్దకు వచ్చే వారి అవసరాలు తీరుస్తుంటాడు.

అలాంటి బక్క జీవి మీద ఒక బలుపు ఎస్ ఐ కన్ను పడింది. ఫుట్ పాత్ మీద టైప్ మిషన్ పెట్టుకొని ఎందుకు బతుకుతున్నావంటూ దురుసుగా ప్రశ్నించేవాడు. తన జీవితంలో అలాంటి పోలీసులు ఎంతోమందిని చూడటం వల్ల కాబోలు.. నిరాశగా.. నిస్తేజంగా చూస్తూ.. సర్ది చెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ.. బలుపు ఎస్ ఐకి అవేమీ పట్టేవి కావు. ఈ మధ్యన ఒకరోజు అటువైపు వచ్చిన ఆయన.. తన తండ్రి వయసున్న వ్యక్తి మీద పోలీస్ జులుం ప్రదర్శించి.. టైప్ రైటర్ ను కాళ్లతో కొట్టి చిందరవందర చేసేశాడు. దాంతో అతడి బతుకు బండి అయోమయంలో పడింది. చేతికి ఆదరవుగా నిలిచిన టైప్ రైటర్ ముక్కలైంది. ఈ దురాగతాన్ని చూసిన ఎవరో  తమ చేతిలో ఉన్న మొబైల్ లోని కెమేరాకు పని చెప్పారు. ఆ వీడియోను అప్ లోడ్ చేసి జరిగిన విషయాన్ని సోషల్ ప్రపంచానికి చెప్పారు.

ఈ వీడియో చూసిన వారు బలుపు ఎస్ ఐ తీరును తీవ్రంగా తప్పుపట్టటమే కాదు.. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన సెగ.. చివరకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూ తగిలింది. వెంటనే స్పందించిన ఆయన.. సదరు ఎస్ఐను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఆ పెద్ద మనిషికి సరికొత్త టైప్ రైటర్ కొనిపెట్టాలన్న ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా సీఎం స్పందించటంతో.. అలెర్ట్ అయిన ఆ ప్రాంతానికి చెందిన డీఎస్పీ వెళ్లి.. ఆ పెద్ద మనిషి యోగక్షేమాలు కనుక్కున్నారట. చుట్టూ కనిపించే ఎన్నో అన్యాయాల్ని మనమేం చేయగలం అనే కన్నా.. సింఫుల్ గా వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే మనవంతుగా మనం చేయగలిగినంత చేసినట్లే.

Tags:    

Similar News