ఒక వ్యక్తిలో రెండు మహమ్మారులు.. హై అలెర్ట్

Update: 2022-07-24 09:00 GMT
ఒక రోగాన్ని కంట్రోల్ చేయడానికే ఆస్తులు అమ్ముకుంటున్న నేపథ్యంలో ఒకే వ్యక్తికి రెండు రోగాలు సోకితే ఇంకా ఏమైనా ఉందా? అంతే సంగతులు.. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అత్యవసర స్థితిని ప్రకటించింది.

వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతుందని నివేదికలు బయటపడ్డాయి. అయితే ప్రస్తుతం మంకీపాక్స్ ఇతర పద్ధతుల్లోనూ ఇతరులకు సోకుతుందని డబ్ల్యూ.హెచ్.వో అధికారులు పేర్కొన్నారు.

తాజాగా ఒకే వ్యక్తిలో కరోనా వైరస్, మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికాకు చెందిన వ్యక్తిలో రెండు వైరస్ లను శనివారం గుర్తించారు. ఇలా ఒకే వ్యక్తిలో రెండు వైరస్ లు గుర్తించడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.

కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్ కు జూన్ లో కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వీపు, కాళ్లు, చేతులు, మెడపై ఎర్రటి బొబ్బలు కనిపించాయి. పరీక్షలు నిర్వహించగా.. ఇది 'మంకీపాక్స్ 'గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇదో ఇన్ ఫ్లూయింజా కేసుగా మారిందని.. జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం.. జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు.

అమెరికాలో ఇప్పటివరకూ 2400 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది.ఈ వైరస్ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

తాజాగా అమెరికాలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా విజృంభిస్తోందని అధికారులు తెలిపారు. జులై 19న అత్యధికంగా ఒక్కరోజే 1.7 లక్షల కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News