తెలంగాణ మాజీ మంత్రి ప్రాణాలు తీసిన కరోనా

Update: 2021-04-16 04:44 GMT
చెలరేగిపోతున్న కరోనా కారణంగా సామాన్యులు.. ప్రముఖులు అన్న తేడా లేకుండా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కన్నుమూశారు. 67 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు తాజాగా కరోనా ఎటాక్ చేయటంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

దీంతో అప్పటినుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు ఆయన ఆరోగ్యం పాడు కావటం.. కొద్ది కాలం క్రితం వరకు కిడ్నీలు ఫెయిల్ కావటంతో డయాలసిస్ మీదనే ఆధారపడ్డారు. పది రోజుల ముందు వరకు బాగానే ఉన్న ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన కిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకు భార్య.. ఒక కుమారుడు.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

జగ్గన్నపేటకు చెందిన చందూలాల్ 1981లో సర్పంచ్ గా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు. 1982లో టీడీపీలో చేరిన ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. అనంతరం 1985లో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రివర్గంలో చోటు సాధించారు. 1989లో ఓడిన ఆయన.. 1994లో మళ్లీ గెలిచారు. 2005లో టీడీపీని విడిచి పెట్టిన ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2014లోటీఆర్ఎస్ తరఫున గెలిచిన ఆయన.. రాష్ట్ర పర్యాటక.. సాంస్కృతిక, గిరిజన సంక్షేమ శాఖల్నినిర్వహించారు. 2018లో ఎన్నికల్లో ఓడిన తర్వాత నుంచి ఆరోగ్యం సహకరించక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా కరోనా ఆయన ప్రాణాల్నితీసింది.



Tags:    

Similar News