భాగ్యనగరం బంద్.. మొత్తం నిర్మానుష్యం

Update: 2020-03-21 07:50 GMT
అన్ని ప్రాంతాల వారు నివసించేందుకు అనువుగా ఉండే ప్రాంతం.. ఎంతమందికి వచ్చినా చోటిచ్చే భాగ్యనగరం ఎప్పుడు ప్రజల తో కిటకిటలాడుతూ ఉండేది. అర్థరాత్రయినా ప్రజలు తిరుగుతుండేవారు. హాయిగా.. ప్రశాంతంగా జీవించే భాగ్యనగరవాసులపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక్కసారిగా హైదరాబాద్ బోసిపోయింది. ఈ వైరస్ భయంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. ప్రయాణాలు మానుకున్నారు.. విందులు, వినోదాలు విరమించుకున్నారు. దీంతో ఎప్పుడు జనం రద్దీతో కిటకిటలాడే ప్రాంతాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. సినిమా థియేటర్ ప్రాంతాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మూసాపేట, సికింద్రాబాద్, దిల్ సుఖ్ నగర్, షాపింగ్ ప్రాంతాలైన కోఠి, బేగం బజార్, అఫ్జల్ గంజ్, అమీర్ పేట తదితర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అయితే ప్రయాణికులు, పర్యాటకులు హైదరాబాద్ కు రాకపోవడంతో ప్రస్తుతం వారిపై ఆధారపడిన వారు పని లేకుండాపోయింది. దీంతో లాడ్జిలు, హోటళ్లు, ట్రావెల్స్ తదితర ప్రయాణం, పర్యాటకంపై ముడిపడి ఉన్నవి మూతపడే స్థాయికి చేరాయి.

అతిథులు, పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చేందుకు వేల సంఖ్యలో లాడ్జీలు, హోటళ్లు హైదరాబాద్ లో ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, పటాన్ చెరు, అమీర్ పేట బస్టాండ్ లు ప్రస్తుతం బోసిపోతున్నాయి. ప్రజలు, పర్యాటకులు రాకపోకలు మానేయడం తో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఖాళీగా కూర్చున్నారు. బస్సు సర్వీస్ లను రద్దు చేశారు. ఉన్న బస్సుల్లో సీట్లు సగం కూడా భర్తీ కావడం లేదు. ఇక లాడ్జీలను ఆధారంగా చేసుకుని క్యాటరింగ్, ట్రావెల్స్‌ వ్యాపారులు జీవిస్తున్నారు. లాడ్జీల వ్యాపారం మూడువారాలుగా మొత్తంగా పడిపోయింది. స్టార్ నుంచి సాధారణ హోటళ్ల దాక పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. బస చేసేవారే కరువయ్యారు. కరోనా వైరస్‌ కారణంగా సికింద్రాబాద్‌ లో లాడ్జీల నిర్వాహకులు దోమలు కొట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు. కానీ ఈ వైరస్ ప్రభావంతో పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంట్లో కాలం వెళ్లదీస్తూ గడుపుతున్నారు.. కానీ ఎక్కడికి టూర్ వెళ్లడం లేదు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆబిడ్స్, అమీర్ పేట, దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, కూకట్ పల్లి, విద్యానగర్ ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు. మరికొందరు ఉద్యోగాల కోసం కొన్ని కోర్సులు నేర్చుకునే వారు. ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బకు సంస్థలు కూడా సెలవు ప్రకటించాయి. పైగా హాస్టల్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో హాస్టల్ వ్యాపారం, కోచింగ్ సెంటర్ల వ్యాపారం దెబ్బతింది. దీంతో ఎప్పుడు విద్యార్థులతో కిటకిటలాడే దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్ పేట, ఆబిడ్స్, కూకట్ పల్లి ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఆటోవాలాలకు కూడా గిరాకీ లేకుండా పోయింది. వారికి వ్యాపారం లేక పార్కింగ్ స్థలాల్లోనే నిద్రపోతున్న పరిస్థితులు. ఈ విధంగా భాగ్యనగరమంతా బోసిపోయి కళావిహీనంగా మారింది. కరోనా వైరస్ దెబ్బకు హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడు వాహనాలతో ట్రాఫిక్ జామయ్యే రోడ్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలతో కళకళలాడే హైదరాబాద్ బోసిపోయి ఉండడం చూస్తే ఎంతటి దుస్థితి వచ్చి పడిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
Tags:    

Similar News