ముందుంది ముస‌ళ్ల పండుగ‌: ప్రైవేటు బ్యాంక్‌ల‌కు క‌రోనా దెబ్బ‌

Update: 2020-04-28 10:50 GMT
ఆర్థిక మంద‌గ‌మ‌నం భార‌త‌దేశంలో ఉన్న ప‌రిస్థితుల్లోనే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం లాక్‌డౌన్ విధించ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది. సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే బ్యాంకింగ్ రంగం కుదేల‌య్యింది. ఇప్పుడు లాక్‌డౌన్ దెబ్బ‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ అతలాకుత‌ల‌మ‌వుతోంది. తీవ్ర ఇబ్బందుల మ‌ధ్య కార్య‌క‌లాపాలు ఈ రంగం కొన‌సాగుతోంది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ప్ర‌భుత్వ స‌హాయంతో నిల‌దొక్కుకునే అవ‌కాశం ఉంది.

కానీ ప్రైవేటు రంగ బ్యాంక్‌ల ప‌రిస్థితే అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యే ప‌రిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ సేవ‌లు నామ‌మాత్రంగా కొన‌సాగుతున్నాయి. కేవ‌లం పింఛ‌న్‌, జీతాల వంటి త‌దిత‌ర వాటి కోసం మాత్ర‌మే ఖాతాదారులు బ్యాంకుల‌కు వ‌స్తున్నారు. మునుప‌టిలా వ్యాపారులు, ఇత‌ర రంగానికి చెందిన వారు బ్యాంక్‌ల‌కు రావ‌డం లేదు. బ్యాంక్‌లో కార్య‌క‌లాపాల‌న్నీ స్తంభించిన‌ట్టే. ఈ నేప‌థ్యంలో ప్రైవేటు బ్యాంకులు ఒడిదుడుకులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. స‌వాళ్లు ఎదురు కాబోతున్నాయి. దీంతో ఆ బ్యాంక్‌లు ఎలా ఎదుర్కొంటాయ‌నే విష‌యం మాత్రం తెలియ‌డం లేదు.

క‌రోనా వైర‌స్ రాకముందు కుప్ప‌కూలిపోయిన ప్రైవేటు బ్యాంక్ ఎస్ బ్యాంక్‌ను అంద‌రూ త‌లా ఇంత చేయి వేసి బ‌తికించారు. దీంతో ఎస్ బ్యాంక్ ఊపిరి పీల్చుకుంది బ్యాంక్‌గా కొన‌సాగుతోంది. ఆర్బీఐ అండ‌గా నిల‌బ‌డ‌డంతో ఆ బ్యాంక్ తిరిగి నిల‌బ‌డింది. లాక్‌డౌన్ ముగిసిన అనంత‌రం ప్రైవేటు బ్యాంక్‌ల ప‌రిస్థితి ఎస్ బ్యాంక్‌ల మాదిరి అవుతాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంక్‌లు తీవ్ర క‌ష్టాలు ఎదుర్కొనే అవ‌కాశం పొంచి ఉంది. ప్ర‌స్తుతం 10 ప్రైవేటు బ్యాంక్‌లు ఉండ‌గా వాటిలో ఒక‌టి దివాళా తీయ‌గా 9 క‌ష్టాల మ‌ధ్య కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ప‌దింటి ప‌రిస్థితి కూడా అదే మాదిరి ఉంది. అయితే ప్ర‌భుత్వ స‌హాయంతో గ‌ట్టెక్కే అవ‌కాశం ఉంది. కానీ ప్రైవేటు రంగ బ్యాంక్‌ల ప‌రిస్థితి ఘోరంగా మారేలా ఉంది.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను ప్రైవేటు రంగ బ్యాంక్‌లు స‌వాల్‌గా ఎదుర్కోవాలి. ఈ స‌మ‌యంలో త‌డ‌బ‌డ్డారంటే దివాళా తీసే ప‌రిస్థితి కనిపిస్తోంది. అన్ని ప్రైవేటు రంగ బ్యాంక్‌ల‌ది అదే ప‌రిస్థితి. అలాంటి స‌మ‌యం వ‌స్తే మాత్రం ఎస్ బ్యాంక్‌ను ఆదుకున్న మాదిరి ఆ బ్యాంక్‌ల‌ను కూడా ఆదుకునేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కృషి చేయాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల‌న్నింటిని జాతీయం చేయాల‌నే డిమాండ్ వ‌స్తోంది. అదే ఉత్త‌మ ప‌రిష్కార మార్గంగా బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప‌రిస్థితులు ఏమిట‌నేవి లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత చూడాల్సి ఉంది.
Tags:    

Similar News