కరోనా ఎఫెక్ట్.. స్టేషన్ బయటకు వెళ్లి తిరిగొచ్చిన రైలు

Update: 2020-03-21 10:54 GMT
పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని వెళితేనే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు సింఫుల్ గా రెండు తమ్ములు.. నాలుగుసార్లు దగ్గితే చాలు వణికిపోయే పరిస్థితి. దీనికి మించి.. చేతికి క్వారంటైన్ లో ఉండాల్సిన ముద్ర కానీ కనిపిస్తే పరేషాన్ కావటమే కాదు.. వ్యవస్థలు వరుస పెట్టి.. వారిని ఇళ్ల దగ్గర దింపి కానీ హమ్మయ్య అనుకోకుండా ఉండలేకపోతున్నాయి. విదేశాల నుంచి వచ్చి.. క్వారంటైన్ లో ఉండాల్సిన పలువురు బాధ్యతారాహిత్యంతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. మరీ ఇంతలానా?అనుకోకుండా ఉండలేం.

ఓపక్క ఇటలీ.. ఫ్రాన్స్.. జర్మనీ.. బెల్జియం లాంటి దేశాల్లో.. అక్కడి పౌరుల నిర్లక్ష్యంతో ఆ దేశాలు కరోనాతో విలవిలలాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితే మన దగ్గర కూడా ఉందని చెప్పాలి. ఫారిన్ నుంచి వచ్చినోళ్లను బుద్ధిగా ఇళ్లల్లో ఉండాలని చెబితే.. అందుకు భిన్నంగా తమకు తోచిన రీతిలో ప్రయాణిస్తున్న వైనం పలువురిని హడలెత్తిస్తోంది. తాజాగా ఇలాంటి ఉదంతమే కాజీపేటలో చోటు చేసుకుంది. ఇలాంటి వారి కారణంగా.. స్టేషన్ దాటి వెళ్లిపోయిన రైలును కూడా వెనక్కి పిలిపించిన అరుదైన ఉదంతం చోటు చేసుకుంది.

విదేశాల నుంచి వచ్చిన ఒక జంట బెంగళూరులో ట్రైన్ ఎక్కారు. ఢిల్లీకి వెళుతున్న ఆ జంట చేతి మీద హౌజ్ క్వారంటైన్ కు సంబంధించిన ముద్రల్ని చూశారు తోటి ప్రయాణికులు. ఆ విషయాన్ని రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే కాజీపేట స్టేషన్ దాటి వెళ్లింది రాజధాని ఎక్స్ ప్రెస్. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు.. ఆర్పీఎఫ్ పోలీసులు వెళ్లిన రైలును వెనక్కి పిలిపించారు. త్రీటైర్ ఏపీలో ఉన్న ఆ జంటను అదుపులోకి తీసుకొని రైలు నుంచి కిందకు దింపారు. ప్రత్యేక అంబులెన్స్ లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రాజధాని రైలుబండి నలభై నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. తమ ఆరోగ్యమే కాదు.. చుట్టూ ఉన్న వారి ఆరోగ్యాల్ని ప్రభావితం చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే.. .ఇలాంటి తీరుకు బ్రేకులు పడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News