హైదరాబాద్ లో పని చేసే ఇద్దరు చైనీయులకు కరోనా?

Update: 2020-02-07 04:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తూ.. ఎప్పుడేం అవుతుందో? ఎలాంటి వార్త బయటకు వస్తుందో? అన్న భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసిందా? హైదరాబాద్ మహా నగరంలో ఆ మహమ్మారి వైరస్ అడుగు పెట్టిందా? అన్న సందేహాలకు గురి చేసేలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ సంస్థల్లో పని చేసే ఇద్దరు చైనీయులకు కరోనా వైరస్ సోకిందన్న వార్తలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి.

అధికారికంగా ధ్రువీకరించటం లేదు కానీ.. కరోనా వైరస్ పరీక్షల్లో ఇద్దరు చైనీయులకు చేసిన పరీక్షలు పాజిటివ్ గా వచ్చాయని.. తదుపరి పరీక్షల కోసం వారి శాంపిల్స్ ను ఫూణెకు పంపినట్లు గా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి పాజిటివ్ కేసులు లేవని చెబుతున్నా.. తాజాగా పాజిటివ్ గా వచ్చిన రిజల్ట్ ను మాత్రం ప్రస్తావించటం లేదని చెబుతున్నారు.
చైనాకు చెందిన ఇద్దరు యువకులు జనవరి నెలాఖరులో హైదరాబాద్ కు వచ్చారు. వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వారు గాంధీ ఆసుపత్రిలోని కరోనా ప్రత్యేక విభాగానికి వెళ్లారు. వారి శాంపిల్స్ ను సేకరించిన వైద్యులు పరీక్షలు జరపగా.. పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. మరోసారి కన్ఫర్మ్ చేసుకోవటానికి వారి శాంపిల్స్ ను ఫూణెకు పంపినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని గాంధీ వైద్య సిబ్బంది కన్ఫర్మ్ చేయటం లేదు. ఆసుపత్రి సూపరిండెంట్ మాట్లాడుతూ.. తమ వద్దకు ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు ఏమీ నమోదు కాలేదని స్పష్టం చేశారు.

అనవసరమైన భయాందోళనలకు గురి కాకుండా ఉండేందుకే.. పాజిటివ్ గా ఫలితం వచ్చిన కేసులకు సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టటం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమే అయితే.. సదరు చైనీయులు గడిచిన కొద్ది రోజులుగా ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారు? అన్నది కీలకంగా మారనుంది. ఈ విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకూ కొత్త టెన్షన్ పట్టి పీడుస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News