ఒక్క రోజులో రూ.28 లక్షల కోట్ల నష్టం.. కరోనా తో చైనాకు భారీ నష్టం

Update: 2020-02-04 04:37 GMT
ఇరవై లక్షల కోట్లు. పేపర్ మీద ఈ అంకె వేయటానికి ప్రయత్నించండి. కచ్ఛితంగా మొదటిసారే.. ఈ అంకెను పక్కాగా వేసే వారు చాలా తక్కువగా ఉంటారు. అంతటి భారీ మొత్తం ఒకటే రోజులో ఆవిరి కావటం అంటే మాటలా? తిరుగులేని ఆర్థిక వ్యవస్థతో పాటు.. ప్రపంచాన్ని తన నిర్ణయాలతో ఇట్టే ప్రభావితం చేసే డ్రాగన్ దేశానికి కరోనా వైరస్ దరిద్రం పట్టింది. అదెంతలా అంటే.. తీవ్రమైన నష్టాలకు గురికావటమే కాదు.. రానున్న రోజుల్లో దేశం పరిస్థితి ఏమైపోతుందన్న భయాందోళనలకు గురి చేసేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

కరోనా వైరస్ కారణంగా చైనా ప్రపంచంలోనే ఏకాకి కానుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాయదారి వైరస్ కారణంగా రోజువారీగా చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోవటం.. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉండటంతో చైనాకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇప్పటికే చైనీయుల్ని తమ దేశాలకు రానిచ్చేందుకు ఏ దేశం ముందుకు రావటం లేదు. కంపెనీలు ఉత్పత్తుల్ని దాదాపు గా ఆపేశాయి. జనాలు రోడ్ల మీదకు రావటం మానేశారు. షాపింగ్ లేదు. రెస్టారెంట్లు నడవటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా సానుకూలత కనిపించని చైనాకు తాజాగా స్టాక్ మార్కెట్ పేకమేడలా కూలి పోతోంది. నిన్నటి రోజున ఏకంగా 8 శాతం పతనమై.. రూ.28లక్షల కోట్ల సంపద ఆవిరై పోయింది.

దీంతో.. చైనా ఆర్థిక వ్యవస్థ కరోనా దెబ్బకు వణికిపోతోంది. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో షాంఘై కంపోసైట్ ఇండెక్స్ ఈ స్థాయిలో పడిపోవటం ఇదే తొలిసారి. అంతేకాదు.. చైనా కరెన్సీ అయిన యువాన్ సైతం భారీగా నష్టపోయింది. ఒకే రోజులో 1.2 శాతం విలువ పడిపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే యువాన్ ఇప్పుడు 7.02 వద్ద ఉంది. చైనా కేంద్రబ్యాంక్ వడ్డీ రేట్లలో కోత విధించినా స్టాక్ మార్కెట్లో అమ్మకాల జోరు తగ్గకపోవటంతో.. స్టాక్ మార్కెట్ పతనాన్ని ఎంతకూ తగ్గించలేని పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. చైనా నుంచి దిగుమతుల్ని భారీగా చేసుకునే దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. చైనాకు ప్రధాన దిగుమతిదారు అయిన ఇండోనేషియా సంగతే తీసుకుంటే.. ఆహారం.. శీతలపానీయాల్ని భారీగా దిగుమతి చేసుకునే ఇండోనేషియా.. ఇప్పుడు చైనా నుంచి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవటాన్ని ఆపేసింది. ఇలా అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న చైనా.. కరోనా పుణ్యమా అని రానున్న రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News