కరోనాపై అమెరికా పోరు... ఏడుగురు డాక్టర్లలో ఒకరు మనవారే !

Update: 2020-04-28 06:50 GMT
కరోనా  మహమ్మారితో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. రోజురోజుకీ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది.  ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. అలాగే 56 వేల మంది కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. ఈ దశలో కరోనాపై అమెరికా చేస్తున్న పోరులో భారతీయ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు  భారత సంతతికి చెందిన వారు ఉన్నారని , పారామెడికల్‌ సిబ్బందిలోనూ భారతీయులు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా ఇప్పుడు సైనికుల మాదిరిగా కరోనా కట్టడికి అవిశ్రాంతంగా, నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు. వారి సేవలను యావత్‌ అమెరికా ప్రశంసిస్తోందని అమెరికన్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌  ఆరిజిన్‌ (ఏఏపీఐ) అధ్యక్షుడు డాక్టర్‌ సురేశ్‌ రెడ్డి వెల్లడించారు.

ఈ మహమ్మారిపై యుద్ధం అంత తొందరగా ముగిసేది కాదు. వ్యాక్సిన్, యాంటీ వైరల్‌ ఔషధం కనుక్కునేవరకూ ఒకటీరెండేళ్లు దీని పీడ ఉంటుంది. గేట్లు తెరిచేసినట్లు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సాధ్యం కాదు. జాగ్రత్తగా వ్యవహరించకపోతే వైరస్‌ మళ్లీ వచ్చేస్తుంది. ఈసారి నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఏం చేసినా.. ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. వారు స్వీయ నియంత్రణ, స్వీయ నిర్బంధాలు, భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటే.. కరోనాను కట్టడి చేయవచ్చు. ఆ మార్గదర్శకాలను పెడచెవిన పెట్టి, విచ్చలవిడిగా తిరిగితే.. కరోనా కేసులు మరిన్ని పెరగవచ్చు అని ఆయన చెప్పారు.

కరోనా వల్ల అమెరికా ఓ గుణపాఠాన్ని నేర్చుకుందని డాక్టర్‌ సురేశ్‌ రెడ్డి వెల్లడించారు. అమెరికా ఇప్పటివరకు ఉత్పాదక రంగంలో చైనాపై ఆధారపడుతూ వచ్చింది. కరోనా దెబ్బతో అది సరికాదనే విషయాన్ని గ్రహించింది. ఇతర దేశాలవైపు మొగ్గుచూపడమో.. సొంతంగా ఉత్పాదకరంగాన్ని ప్రోత్సహించడమో చేయనుంది. ఉదాహరణకు.. అమెరికాలో ఉత్పాదక రంగం బాగుండి ఉంటే.. ఇప్పుడు మాస్కులు, పీపీఈ పరికరాలు, వెంటిలేటర్ల కోసం చైనా వైపు చూడాల్సి వచ్చేది కాదు అని వివరించారు.
Tags:    

Similar News