షాకింగ్... వ్యాక్సిన్ వచ్చినా కరోనా పూర్తిగా పోదంట

Update: 2020-05-01 03:30 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న ప్రాణాంతక వైరస్ నిజంగానే జగమొండిదట. ఇప్పటిదాకా మానవాళిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడంతో పాటుగా లక్షలాది మంది ప్రాణాలను తీసిన వైరస్ లన్నీ ఆ తర్వాత మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన వ్యాక్సిన్ ను తలొంచేశాయి. అయితే ఇప్పుడు మనలను ఇళ్లకే పరిమితం చేస్తూ... యావత్తు ప్రపంచ దేశాలను లాక్ డౌన్ లోకి పంపిన కరోనా మహమ్మారి ఏ వ్యాక్సిన్ కూడా లొంగే రకం కాదంట. ఈ మేరకు వైరస్ లు, వాటికి విరుగుడుగా కనుగొన్న వ్యాక్సిన్ లపై మంచి పట్టున్న నిపుణులు ఆందోళన కలిగించే ఈ వార్తలను చెబుతున్నారు. కరోనా మహమ్మారి వైరస్ లొంగే రకం కాదని, ఇది మనతోనే చాలా కాలం పాటు కొనసాగుతుందని, దీనితో మనమంతా సహజీవనం చేస్తూనే, చాలా జాగ్రత్తగా మసలుకోక తప్పదని కూడా వారు చెబుతున్నారు.

ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికాలో కరోనాతో విలవిల్లాడుతున్న న్యూయార్క్ లో ఉంటున్న పాండెమిక్ నిపుణుడు డాక్టర్ టోనీ ఓ సంచలన ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వచ్చినా కరోనా లొంగే రకం కాదని పేర్కొన్న ఆయన... అసలు ‘స్టే హోం’ ఉద్దేశ్యం ఆస్పత్రులకు రోగులు వెల్లువెత్తే పరిస్థితి నిరోధించేకేననని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి మనం ఎంతగా చర్యలు తీసుకున్నా.. అది మనలకు దూరమయ్యే పరిస్థితులు అస్సలే లేవని కూడా ఆయన చెప్పారు. కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నామని, అయితే అది ఇప్పట్లో జరిగే పని కాదని కూడా ఆయన పేర్కొన్నారు. కరోనాను నిలువరించే వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలే లేవని కూడా ఆయన డేంజర్ బెల్స్ వినిపించారు.

ఇదిలా ఉంటే... అమెరికాకే చెందిన పలువురు శాస్త్రవేత్తలు కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తున్నారు. మరికొన్నేళ్ల పాటుగా మనమంతా కరోనాతో సహజీవనం చేయక తప్పదని, ఆ సహజీవనంలో కరోనా సోకకుండా జాగ్రత్తగా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. కొన్నేళ్ల పాటు మనతోనే సాగనున్న కరోనా.. విడతలవారీగా మనపై దాడి చేస్తూనే ఉంటుందని కూడా వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనాను పూర్తిగా నియంత్రించే వ్యాక్సిన్ తయారీకి ఎన్నేళ్లు పడుతుందో కూడా చెప్పడం సాధ్యం కాదని కూడా వారు చెబుతున్న మాటలు నిజంగానే ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. మొత్తంగా కరోనా ఇప్పటికిప్పుడు తగ్గినా.. దానితో పోరాటం మరికొన్నేళ్ల పాటు చేయక తప్పదన్న మాటను అన్ని రంగాలకు చెందిన నిపుణులు చెబుతుండటం గమనార్హం.
Tags:    

Similar News