కరోనా దెబ్బకు పారిపోయిన ఏపీ ఎమ్మెల్యేలు

Update: 2020-03-30 05:30 GMT
కరోనా కేసులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసులు 20 దాటాయి. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కరోనా కేసులు పెరగకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్రమత్తంగా ఉన్నారు. నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు కావడం లేదని గుర్తించిన జగన్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పక్కాగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని, కరోనా పాజిటివ్, అనుమానితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలని ఆదేశిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆస్పత్రుల్లో వైద్య సేవలను ఆరా తీస్తూ వైద్యులు, వైద్య సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అనుమానితులు, దేశవిదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉండేలా చూస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా జగన్‌ కొంత అసహనానికి గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో సక్రమంగా లాక్‌డౌన్, ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదని గుర్తించారు.

అయితే తెలంగాణలో మాదిరి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు లాక్‌డౌన్‌పై చర్యలు తీసుకోవడం లేదు. అక్కడ కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ప్రజాప్రతినిధులంతా రోడ్లపైకి వచ్చి ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడంతో పాటు లాక్‌డౌన్‌ అమలు, హోంక్వారంటైన్, పరిశుభ్రత చర్యలు వంటివి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలంతా స్థానికంగా లేరని సమాచారం. అందుకే పర్యవేక్షణ లేక ప్రజలు లాక్‌డౌన్‌ను అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. స్థానికంగా ప్రజాప్రతినిధి ఉండి పోలీసులతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం.. ఏర్పాట్లు పరిశీలించడం.. సమీక్షించడం వంటివి చేయడం లేదు. అందుకే గత రెండు రోజులుగా లాక్‌డౌన్‌ సక్రమంగా అమలు కావడం లేదని విమర్శలు వచ్చాయి. దీనిపై జగన్‌ ఆగ్రహంగా ఉన్నారు. విపత్కర సమయంలో నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ఎమ్మెల్యేలు ఎక్కడకు వెళ్లారని జగన్‌ ఆరా తీసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు మాత్రం స్థానికంగా ఉండకుండా హైదరాబాద్, బెంగళూరులో మకాం వేశారని తెలుస్తోంది. వారు స్థానికంగా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారి నివాసాలు హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారంతా అక్కడకు వెళ్లిపోయారంట. దీంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కనిపించడం లేదు.

అధికారులతో సమన్వయం చేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండకపోవడంపై ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైనా వస్తే ఎవరిని సంప్రదించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో స్థానికంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఉండకపోతే ఎలా అని జగన్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎలా ఉన్నారో చూసి నేర్చుకోవాలని హితవు పలికినట్లు సమాచారం. వెంటనే నియోజకవర్గాల్లో వాలిపోవాలని జగన్‌ ఆదేశించారంట. లాక్‌డౌన్‌ అమలు, ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందుతున్నాయా లేవా అని పరిశీలించాలని సూచించారంట. ఈ సమయంలో ప్రజలకు తోడుగా ఉండాలని తెలిపారంట. 
Tags:    

Similar News