కరోనా విజృంభణ తగ్గుతోందా?... ఏపీలో 10, తెలంగాణలో 40 కేసులు

Update: 2020-04-08 03:15 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ఓ మోస్తరులో తగ్గినట్టే కనిపిస్తోంది. సోమవారం దాకా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా... మంగళవారం కొత్తగా నమోదైన కేసు సంఖ్యలో కాస్తంత తగ్గుదల కనిపించింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా నమోదైన కేసుల సంఖ్యలో మంగళవారం గణనీయంగా తరుగుదల కనిపించిందనే చెప్పాలి. మహారాష్ట్ర, తమిళనాడులను మినహాయిస్తే... దేశంలో కొత్తగా నమోదైన కేసులు మంగళవారం భారీగానే తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తిరోగమన దిశకు చేరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఏపీ విషయానికి వస్తే... సోమవారం దాకా ఏపీలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా ఉండగా... మంగళవారం మాత్రం కొత్త కేసుల సంఖ్య 10కి చేరింది. మంగళవారం నాడు కొత్తగా 10 కేసులు నమోదు కాగా... ఇప్పటిదాకా ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 314కు చేరింది. మంగళవారం నమోదైన కొత్త కేసుల్లో గుంటూరు జిల్లాలో 8, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో ఇప్పటిదాకా ఆరుగురు కరోనా రోగులు డిశ్చార్జీ అయ్యారు. ఇక మరణాలు కూడా మంగళవారం రాష్ట్రంలో నమోదు కాలేదు. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే... మంగళవారం తెలంగాణలో కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో చికిత్స తీసుకుని డిశ్చార్జీ అయిన వారి సంఖ్య కూడా మంగళవారం నాటికి 45కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స తీసుకుంటున్న కరోనా రోగుల సంఖ్య 348గా నమోదైంది. హైదరాబాద్ లో అత్యధికంగా 150 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ తర్వాతి స్థానంలో 36 కేసులతో నిజామాబాద్ జిల్లా, 23 కేసులతో వరంగల్ అర్బన్ జిల్లాలు నిలిచాయి.  ఇదిలా ఉంటే... దేశవ్యాప్తంగా మంగళవారం నాడు కొత్తగా 508 కేసులు నమోదు కాగా... ఇప్పటిదాకా దేశంలో 4,789 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటిదాకా 353 మంది డిశ్చార్జీ కాగా... 124 మంది మృత్యువాత పడ్డారు.
Tags:    

Similar News