దేశంలోని కరోనా వైరస్ లో తేడాలున్నాయా?

Update: 2020-04-01 06:30 GMT
అవును.. ఇప్పుడిదో అనుమానంగా మారింది కొందరిలో. కరోనా వైరస్ భారత్ లోకి విదేశాల నుంచి వచ్చిందే అయినా.. దాని తీవ్రతలో ఇప్పుడు తేడాలు ఉన్నట్లుగా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్.. యూరప్.. తదితర దేశాల నుంచి వచ్చిన వారు తీసుకొచ్చిన వైరస్ తీవ్రతకు.. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల వేళ అంటుకొని దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందిన వైరస్ తీవ్రతలోనూ తేడా ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. కరోనా వ్యాప్తికి సంబంధించి ఆసక్తికర అంశాలు కొన్ని కనిపిస్తాయి. తెలంగాణలో తొలి కేసు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి సోకింది. పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండానే.. గాంధీ వైద్యులు చేసిన చికిత్సతో స్వస్థత చేకూరటమే కాదు.. ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. మొన్న జరిగిన మన్ కీ బాత్ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో నేరుగా ఫోన్లో మాట్లాడే అవకాశం లభించింది. ఆ యువకుడికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు చెబుతారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత కరోనా అనుమానాలు లేని వేళలో.. తన తండ్రితో కలిసి పలు చోట్లకు వెళ్లారని చెబుతారు. వారు వెళ్లిన ప్రాంతాల్లోని వారికి మాత్రమే కాదు.. సదరు యువకుడి వెంట వెళ్లిన ఆయన తండ్రికి కూడా కరోనా సోకలేదు.

దీనికి భిన్నంగా ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులతో తిరిగిన కొందరికి కరోనా పాజిటివ్ గా తేలటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు వేగంగా వ్యాప్తి చెందిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే రీతిలో ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉందంటున్నారు. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఈ తరహా విశ్లేషణలు సరికావంటున్నారు. లాజిక్ గా చూసినప్పుడు బాగానే ఉన్నా.. ఒక వ్యక్తిలోని వైరస్ మరో వ్యక్తిలోకి ప్రవేశించకుండా ఉండటానికి సదరు వ్యక్తి తీసుకునే జాగ్రత్తలతో పాటు.. చాలా అంశాలు దోహద పడతాయని చెబుతున్నారు.

అయితే.. వైరస్ వేర్వేరు అన్న సందేహాలు రావటానికి కారణం గా ప్రముఖ వైద్యుల.. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాటలు కూడా కారణంగా చెప్పాలి. యూరప్ లోని కరోనా వైరస్ తీవ్రతకు.. దేశీయంగా పాజిటివ్ గా తేలిన వారిలో ఉన్న వైరస్ తీవ్రతలో తేడాలు ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. వైరస్ కొమ్ములు మన దగ్గర బలహీనంగా ఉండటం ద్వారా.. దాని ప్రభావం భారతీయుల మీద పెద్దగా పడలేదని చెబుతున్నారు. అదే సమయంలో.. ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో పాటు.. తాజాగా ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన వారి నుంచి వ్యాప్తి చెందటానికి కారణం.. వైరస్ బలంలో తేడానే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ మత ప్రార్థనల సందర్భంగా వ్యాప్తి చెందిన వైరస్.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి వ్యాప్తి చెందిందని.. దాని తీవ్రత ఎక్కువగా ఉందన్న అనుమానాలున్నాయి. అయితే.. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఇలాంటి వాదనలు చేసే కన్నా.. ఆ దిశగా పరిశోధనలు చేసి.. సందేహాల్ని తీర్చే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకుంటే మంచిందంటున్నారు.

Tags:    

Similar News