ఇటలీలో ఆగని మృత్యుఘోష..ఒకేరోజు 250 మంది మృతి!

Update: 2020-03-14 07:15 GMT
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలో పుట్టినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకి విస్తరించి అందరిని వణికిస్తుంది. ఇకపోతే చైనా తరువాత కరోనా ఇటలీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అలాగే, కరోనా మరణాల జాబితాలో చైనా తర్వాత ఇటలీ పేరే ఉంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో చాలా ప్రాంతాల్లో కరోనా విస్తరించినా ప్రభావం మాత్రం ఇటలీలోనే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎన్నో ఆంక్షలు విధించినా కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం ఇటలీ లో రోజువారీ జీవనం కష్టంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు - విద్యాసంస్థలు - వ్యాపార సంస్థలు - షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి.

ఇటలీలో ఎక్కడ చూసినా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. ఇటలీలో ఒక్కరోజే 250 మంది మృతిచెందారు. దీనితో కరోనా మృతుల సంఖ్య 1,266కు చేరింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉత్తర ఇటలీ గూడ్స్‌ - టెక్స్‌ టైల్‌ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. లక్షలాది మంది దేశ విదేశీ కార్మికులు ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారు. అయితే నిర్వహణ భారంగా మారడంతో చాలా పరిశ్రమలను చైనాకు అమ్మేశారు. దీనితో ఇక్కడి టెక్స్‌ టైల్ పరిశ్రమ మొత్తం చైనా కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు దాదాపు లక్షమంది చైనా కార్మికులను దేశంలోకి అనుమతించింది ఇటలీ.

ఇక్కడి ప్రధాన నగరాలకు చైనాలోని వుహాన్‌ తో నేరుగా ఎయిర్ కనెక్టివిటీ ఉంది. వుహాన్  - నార్త్ ఇటలీ మధ్య నిత్యం విమాన రవాణా సాగుతూ ఉంటుంది.వుహాన్‌ లో కరోనా వైరస్ విజృంభించిన తర్వాత కూడా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు యదేచ్ఛగా సాగిపోయాయి. కరోనా కోరల్లో చిక్కుకుని ఇంకా లక్షణాలు బయటపడని వుహాన్ వాసులు ఇటలీ ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు వెళ్లారు. దీంతో కరోనా ఇటలీలో చాప కింద నీరులా వ్యాపించింది. ఇతర దేశాల కార్మికులను అనుమతించే విషయం లో యూరోపియన్ యూనియన్ నిర్లక్ష్యం గా వ్యవహరించడం కూడా కరోనా వ్యాప్తికి మరో కారణం. మొత్తంగా చైనా తరువాత - ఇటలీలోనే ఈ వైరస్ ఎక్కవగా సోకుతుంది.
Tags:    

Similar News