టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ .. వార్ రూమ్ తో కరోనా కి ముంబై చెక్ !

Update: 2021-05-08 07:30 GMT
దేశంలో సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా దేశంలో సెకండ్ వేవ్ మొదలైంది మహారాష్ట్రలో .. అక్కడ రోజు రోజుకి కరోనా మహమ్మారి కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతూ వచ్చాయి. ముఖ్యంగా ముంబై మహానగరంలో రోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదు అయ్యేవి. కానీ, ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగు వేలలోపే. దీనికి ప్రధాన కారణం  బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలే. కరోనా ను  బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎలా కట్టడి చేసింది. ఎలాంటి చర్యలు తీసుకుంటే కరోనా తగ్గుముఖం పడుతూ వచ్చింది, సుప్రీంకోర్టు కూడా మెచ్చుకునేలా బీఎంసీ అధికారులు ఏం చేశారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో కరోనా కేసులు పెరుగుతుంటే , మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. బీఎంసీ అధికారులు , బీఎంసీ అదనపు ఆరోగ్య కమిషనర్‌  సురేశ్‌ కాకాని ముందుచూపుతో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఇది సాధ్యమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రొటోకాల్‌ ను పాటిస్తూ.. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌ ను ముమ్మరం చేయడమే కాకుండా ,ప్రజలు ఆందోళన చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.  కొవిడ్‌ బెడ్ల కోసం ఉరుకులూ పరుగులూ పెట్టకుండా సింగిల్‌ విండో వ్యవస్థను ఏర్పాటు చేశారు. వార్‌ రూం అంటే సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు వ్యూహాల కోసం ఏర్పాటు చేసుకుంటాయి. బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాని కొవిడ్‌ నియంత్రణకు వార్‌ రూం వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 4న 11,163 కేసులు నమోదవ్వడంతో.. యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది మొదలు.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, మందుల సరఫరా, లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆస్పత్రిలో చికిత్స వంటివాటిపై వార్‌ రూం దృష్టిపెడుతుంది.

వార్‌ రూం ఏర్పాటైన తొలినాళ్లలో టోల్‌ఫ్రీ నంబర్‌ కు వచ్చే ఫోన్‌ కాల్‌ ఆధారంగా అధికారులు ఏ ఆస్పత్రిలో బెడ్‌ ఖాళీగా ఉందో తెలుసుకునే వారు. ఇది భారీ ప్రక్రియ కావడంతో.. సురేశ్‌ కాకాని డ్యాష్‌బోర్డు వ్యవస్థను పరిచయం చేశారు. అంతే.. ఒక్క మీటతో సాధారణ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్ల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి సమస్యలను దృష్టిలో పెట్టుకుని, మొత్తం 24 వార్డుల్లో 24 వార్‌రూంలను ఏర్పాటు చేశారు. ఈ 24 వార్‌రూంలతో ప్రధాన వార్‌ రూం అనుసంధానమై ఉంటుంది. కరోనా తొలి వేవ్‌ లో ముంబై లో జంబో సెంటర్‌ పేరుతో తాత్కాలిక కరోనా వైరస్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. వాటిని తొలగించాలని బీఎంసీ నిర్ణయించగా, సురేశ్‌ కాకాని అభ్యంతరం చెప్పారు. సెకండ్‌ వేవ్‌ లో పరిస్థితిని ముందే అంచనా వేసి, మరిన్ని జంబో సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన ఊహించినట్లే , ఫిబ్రవరి రెండో వారం నుంచి ముంబైలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. మొదటివేవ్‌లో 12వేల బెడ్లు ఉండగా  ఇప్పుడా సంఖ్య 24 వేలకు చేరుకుంది. వీటిల్లో 12,754 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. 2,929 వెంటిలేటర్‌ బెడ్లు కొవిడ్‌ చికిత్సకు సిద్ధమయ్యాయి. అలాగే కొవిడ్‌ లక్షణాలు తీవ్రమై, ఛాతీలో ఇన్ఫెక్షన్‌ స్థాయికి వెళ్లిన రోగులకు అవసరమయ్యే రెమ్‌డెసివిర్‌ వంటి మందుల కొరత లేకుండా బీఎంసీ ముందు నుంచి జాగ్రత్త తీసుకుంది. అలాగే ఆక్సిజన్‌ కొరత లేకుండా పక్కాగా రూట్‌ మ్యాప్ ను సిద్ధం చేసుకొని కరోనా పై విజయం సాధించారు.
Tags:    

Similar News