కరోనా డేంజర్: దేశంలో 24గంటల్లో అత్యధిక కేసులు

Update: 2020-04-10 14:10 GMT
కరోనా వైరస్ దేశంలో జడలు విప్పుతూనే ఉంది. ఓ వైపు లాక్ డౌన్ పొడిగింపు గడువు దగ్గరకు వస్తోంది. జనం ఇబ్బందులు, ఆర్థిక పతనం దృష్ట్యా ఎత్తివేస్తారని యోచిస్తుంటే దేశంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా భారత దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 896 కేసులు, 37 మరణాలు చోటుచేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో ఇదే అత్యధికమని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

దేశంలో మూడోస్టేజికి కరోనా వచ్చినట్టు కనిపిస్తోంది. సామూహిక వ్యాప్తి మొదలైతేనే ఇన్ని కేసులు వెలుగుచూస్తాయి. ఎవరి నుంచి ఎవరికి సోకుతుందనేది నిర్ధారణ కాదు. దీంతో కేసులు రానున్న రోజుల్లో మరిన్ని పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 6761మందికి కరోనా సోకినట్టు కేంద్రం తెలిపింది. ఇందులో ఇప్పటివరకు కరోనాతో 206మంది మరణించారని తెలిపింది. ఇక 516మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేలాది మందికి 213 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని.. 49వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్ ఇచ్చామని కేంద్రం పేర్కొంది.


Tags:    

Similar News