తెలంగాణలో కరోనా 2వ స్టేజ్.. కరీంనగర్ లో ఒకరికి పాజిటివ్

Update: 2020-03-23 07:19 GMT
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కరోనా 2వ స్టేజ్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకులతో కలిసి సంచరించిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 28కి చేరాయి.

తాజాగా సోమవారం అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కె.శశాంక  అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపారు. మత ప్రచారకులకు కరోనా వైరస్ ఉండడం వలనే కరీంనగర్ వ్యక్తికి కూడా సోకిందని కలెక్టర్ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కరోనా సోకిన కరీంనగర్ వ్యక్తి ఇంతవరకు ఎవరిని కలిశారో వారితో పాటు ఇదివరకు ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులతో సన్నిహితంగా సంచరించిన వారు కూడా కచ్చితంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు. కరీంనగర్ ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, ఒకరికి ఒకరు దూరం పాటించాలని కలెక్టర్ కోరారు. పరిశుభ్రత పాటించడంతో నిత్యం చేతులు శుభ్రం చేసుకొవాలని సానిటైజర్స్ ఉపయోగించాలని పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు ప్రజలందరు ఇండ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

ఇండోనేషియన్లతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి దాదాపు 14 రోజుల తర్వాత కరోనా వైరస్ బయటపడింది. ఈనేపథ్యంలోనే వారితోపాటు తిరిగిన చాలా మందికి ఈ వైరస్ బయటపడే ప్రమాదం ఉంది. దీంతో తెలంగాణలో వైరస్ 2వ స్టేజీకి చేరిందని.. ఇది ప్రమాద ఘంటిక అని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News