సండేవేళ.. ఆరున్నర గంటల రివ్యూ పెట్టిన సారు

Update: 2020-04-13 03:45 GMT
మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సీఎం వ్యవహారశైలి. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. ఆయన వేసుకున్న అంచనాలకు భిన్నమైన పరిస్థితుల్ని తీసుకొచ్చింది కరోనా. తొలుత లైట్ తీసుకున్నా.. ఈ మహమ్మారి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన ఆయన అప్రమత్తమయ్యారు. తన తీరుకు భిన్నంగా తరచూ రివ్యూల్ని నిర్వహించటమే కాదు.. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఏకరువు పెడుతూ.. ప్రజలకు అన్ని విషయాల్లోనూ అవగాహన కలిగేలా చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే..కరోనా కారణంగా ఆగిన ఆదాయం కేసీఆర్ ను కలవర పెడుతోంది. తొలుత అనుకున్నట్లుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయేది కాదన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కరోనాకు చెక్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. తాను లెక్కలు వేసుకున్నట్లుగా ఏప్రిల్ మొదటి వారంలో కరోనా లెక్క తేలుతుందన్న ఆశల్ని.. మర్కజ్ ఎపిసోడ్ దెబ్బ కొట్టటం తెలిసిందే.

తాజాగా ఆయన ఏప్రిల్ 25ను కరోనా కంట్రోల్ చేసేందుకు కొత్త టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే గుర్తించిన మర్కజ్ కేసులు.. వాటి కాంటాక్టులకు పరీక్షలు చేయించటం ద్వారా కొత్త కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికి తన అంచనాలకు భిన్నంగా కేసుల నమోదు కావటంపై ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. గురు.. శుక్ర.. శనివారాల్లో పాజిటివ్ కేసులు ఫర్లేదన్న పరిస్థితి నుంచి ఆదివారం నాటికి మరింత తగ్గుతాయన్న అంచనాకు భిన్నంగా 28 కేసులు పాజిటివ్ గా తేలటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.

మరింత అప్రమత్తంగా వ్యవహరించటంతో పాటు.. లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 531 పాజిటివ్ కేసులు రాగా.. పదహారు మంది మరణించారు. తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 412 మంది మాత్రమే. ఇప్పటివరకూ అధికారుల అంచనా ప్రకారం ఆరు వందల వరకూ పాజిటివ్ కేసులు నమోదైనా ఫర్లేదనని.. కానీ దాన్ని దాటితే మాత్రం ఇబ్బందన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు నిజామాబాద్ లో నమోదు కాగా.. ఐదు జిల్లాల్లో ఇరవైకి పైగా కేసులు నమోదు కాగా.. పద్నాలుగు జిల్లాల్లో రెండంకెల కేసులు నమోదు కావటంపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. వీలైనంత త్వరగా ఈ మహమ్మారికి చెక్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ఆరున్నర గంటల రివ్యూ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కరోనా విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు.. వారిని ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం సెలవు రోజు అయినా.. ఉన్నతాధికారులతో కలిసి గంటల కొద్దీ సమయాన్ని రివ్యూకు కేటాయించటం చూసినప్పుడు.. కరోనా విషయంలో కేసీఆర్ ఎంత కేర్ ఫుల్ గా ఉన్నారో అర్థమవుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పని ఒత్తిడిలోనూ కేసీఆర్ తన తీరు మార్చుకోకుండా ఇన్నేసి గంటల రివ్యూ ఏమిటన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News