తెలంగాణ‌లో అద్భుత ఫ‌లితం.. ఐసోలేష‌న్‌, క్వారంటైన్లు ఖాళీ

Update: 2020-04-13 09:10 GMT
కరోనా వైర‌స్ నివార‌ణ‌లో భాగంగా అనుమానితులు, దేశ‌విదేశ ప్ర‌యాణాలు చేసిన వారిని క్వారంటైన్‌, ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచ‌గా అవ‌న్నీ బాధితుల‌తో కిట‌కిట‌లాడాయి. ప్ర‌స్తుతం వారి గ‌డువు ముగిసి ఎలాంటి వ్యాధి లేక‌పోవ‌డంతో వారంతా ఇళ్ల‌కు వెళ్తున్నారు. దీంతో ఆ కేంద్రాల‌న్నీ ఖాళీ అవుతుండ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి గుర్తింపు, వారి క్వారంటైన్‌ సహా వైరస్‌ ఇంకుబేషన్ స‌మ‌యం ముగియడంతో ఇప్పటివరకు ఆయా కేంద్రాల్లో చేరిన వారంతా ప్ర‌స్తుతం ఇళ్ల‌కు వెళ్తున్నారు. వారంద‌రికీ క‌రోనా సోక‌లేద‌ని నిర్ధార‌ణ కావ‌డంతో ప్ర‌జ‌లతో పాటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఐసోలేష‌న్ కేంద్రాలుగా ఉన్న హైద‌రాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, నేచర్‌క్యూర్ ఆస్ప‌త్రి, నిజామియా ఆస్పత్రిలు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్‌లో ఐదు క్వారంటైన్‌ సెంటర్లల‌లో కూడా ప్ర‌జ‌లు త‌గ్గిపోతున్నారు. వీటిలో ప్రస్తుతం 160 మంది ఉన్నారు.

మేడ్చల్‌ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లాలో 135 మంది మాత్రమే ఉన్నారు. గాంధీ, కింగ్‌కోఠి, ఫీవర్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 364 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. వెంట‌నే ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన వారిని హోం  క్వారంటైన్‌ కు తరలించి, వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

మార్చి 22వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి సుమారు 74 వేల మంది శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకోగా వారిలో 25,937 వేల మందికి పైగా ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్ల లో ఉంచారు. వీరిలో 30 మందికి ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా వైరస్‌ సోకగా, వీరి నుంచి మరో 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్‌ విస్తరించింది. వారందరినీ గుర్తించి చికిత్స అందించారు. కోలుకున్న వారిని ఇంటికి పంపించారు. మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో జ‌రిగిన జమాత్‌ కు తెలంగాణ నుంచి 1,089 మంది వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. హైద‌రాబాద్‌లో 603 మందితో పాటు, వారికి సన్నిహితంగా 3,015 మంది ఉండగా, వారందరినీ క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. వీరి తుది ఫ‌లితాలు మూడు రోజుల్లో తేల‌నుంది.

హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రుల్లో ఇలా..
- గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్‌ సెంటర్‌లో శనివారం వరకు 295 పాజిటివ్‌ కేసులు ఉండగా, కరోనా అనుమానితులు  250 మంది ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు.
- ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి లో 29 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో మరో 10 మంది అనుమానితులు ఉన్నారు.
- కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో 12 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఐసోలేషన్‌ వార్డులో మరో 74 మంది అనుమానితులు ఉన్నారు.
- న‌ల్ల‌కుంట్ల‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో 30 మంది అనుమానితులు ఉన్నారు.
ఇక వీటితో పాటు హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి లో, వికారాబాద్ జిల్లా అనంత‌గిరి తో పాటు మ‌రికొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌, ఐసోలేష‌న్ కేంద్రాల్లో క‌రోనా అనుమానితులు ఉన్నారు. వారి గ‌డువు కూడా ముగుస్తుండ‌డం తో ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇళ్ల‌కు చేరుతున్నారు. దీంతో కొంత క‌రోనా వైర‌స్‌ ను క‌ట్ట‌డి చేసిన వార‌మైన‌ట్టే.

Tags:    

Similar News