మే 15 నాటికి భారత్ లో కరోనా విశ్వరూపం?

Update: 2020-03-25 07:41 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది మృత్యువాతపడ్డారు. 185కు పైగా దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి దెబ్బకు ఆయా దేశాల ప్రభుత్వాలు గడగడలాడిపోతున్నాయి. భారత్ తో సహా పలు దేశాలు లాక్ డౌన్ బాటపట్టాయి. ఇటలీ - ఇరాన్ - స్పెయిన్ - అమెరికా ఉదంతాలు చూసిన తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జనతా కర్ఫ్యూ రోజును - ఆ తర్వాతి రెండు రోజులను కలుపుకొని ఏప్రిల్ 14వరకు దాదాపు 24 రోజుల పాటు భారత్ లాక్ డౌన్ అయింది. మార్చి 24న ప్రధాని మోడీ ఇచ్చిన 21 రోజుల లాక్ డౌన్ తో భారత ప్రజలంతా దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు భారత్ తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. ఇటలీ వంటి ఉదంతాలను చూసిన భారత్ చాలా వేగంగా కరోనా కట్టడికి నడుం బిగించిందని కితాబిచ్చింది. అయితే, కేవలం లాక్ డౌన్ వల్ల మనం కరోనాను తరిమివేయగలమా? 21 రోజుల లాక్ డౌన్ తర్వాత కరోనా ముప్పునుంచి భారత్ తప్పించుకున్నట్లేనా? కరోనా పెనువిపత్తు నుంచి మనం ఎన్ని రోజుల్లో పూర్తిగా బయటపడగలం? అన్న ప్రశ్నలకు కొద్దిగా ఆందోళన కలిగించే సమాధానాలిస్తున్నారు శాస్త్రవేత్తలు.

భారత ప్రజలు 21 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉండడం అంటే లాకప్ లో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు.  మార్చి 22న జనతా కర్ఫ్యూ ముగిసిన మరుక్షణమే రోడ్లమీదికి వచ్చి కరోనాను తరిమేసినట్లు తాండవం చేశారు. అసలు సోషల్ లేదా ఫిజికల్ డిస్టన్సింగ్ ద్వారా కరోనా బారి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చని - టెస్ట్ - టెస్ట్ - టెస్ట్ ద్వారా మిగతా ముప్పును ఎదుర్కో వచ్చని చాలామంది భారతీయులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే భారత్ లో కరోనా కేసుల తీవ్రత రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో అంచనా వేసే శక్తి మెజారిటీ భారతీయుల్లో లేదన్నది కఠోర సత్యం. అందుకే, కరోనాపై అధ్యయనం చేస్తోన్న ఇంటర్ డిసిప్లినరీ గ్రూపు సైంటిస్టులు భారత్ ను హెచ్చరిస్తున్నారు. 135 కోట్ల జనాభా ఉన్న భారత్ లో వైద్య సదుపాయాలు కరోనా పూర్తిస్థాయిలో విజృంభిస్తే తట్టుకునే స్థాయిలో లేవని ఆ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లో కరోనా స్క్రీనింగ్ టెస్టులు తక్కువగా జరిగాయని...ఇంకా చాలా అనుమానిత కేసులు టెస్ట్ చేయాల్సి ఉందని..అంతమంది వైద్య సిబ్బంది...ఐసోలేషన్ వార్డులు - క్వారంటైన్ కేంద్రాలు...భారత్ లో లేరని అంటున్నారు. మార్చి 18 నాటికి 11500 మందికి మాత్రమే స్క్రీనింగ్ చేయగలిగారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. భారత్ లో కరోనా మూడో దశకు చేరుకుంటే అదుపు చేయడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు.

అమెరికా, ఇటలీల్లోనూ భారత్ తరహాలోనే కేసుల పెరుగుదల ఉందని, మే 15 నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో జరిగిన స్క్రీనింగ్ టెస్టు ఆధారంగా మూడో దశలో కేసులను లెక్కగట్టకూడదని హెచ్చరిస్తున్నారు. 13 రోజుల లాగ్ ను పరిశీలిస్తే మార్చి 19నాటికి అమెరికా తరహాలోనే భారత్ లోనూ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. అమెరికా - ఇటలీ వంటి అత్యాధునిక వైద్యసదుపాయాలు కలిగిన దేశాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే...ప్రతి 1000 మందికి 0.7 శాతం పడకలు మాత్రమే ఉన్న భారత్ వంటి దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చని అంటున్నారు. ఫ్రాన్స్ లో 1000 మందికి 6.5 - సౌత్ కొరియాలో 11.5 - చైనాలో 4.2 - ఇటలీలో 3.4 - బ్రిటన్ లో 2.9 - అమెరికాలో 2.8 పడకలున్నాయని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ వంటి మహానగరంలోనే 700 వరకు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని....మొత్తం దేశంలో ఆ సంఖ్య కరోనాను తట్టుకునే రేంజ్ లో లేదని అంటున్నారు. అందుకే, లాక్ డౌన్ తో పాటు అనుమానిత కేసులను గుర్తించడంలో భారత్ సక్సెస్ అయితే చాలావరకు బయటపడ్డట్లేనంటున్నారు. లేదంటే,  కరోనా దెబ్బకు భారత్ లో `మే`డే తప్పదని అభిప్రాయపడుతున్నారు.



Tags:    

Similar News