ఓయూలో రాహుల్ సభకు నో చెప్పేసిన కౌన్సిల్

Update: 2022-04-30 10:33 GMT
ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం అన్నంతనే.. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డగా గుర్తుకు వస్తుంది. వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతూ చేపట్టిన ధర్నాలు..దీక్షల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఉస్మానియా వర్సిటీ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా పని చేయటమే కాదు.. వివిధ వర్గాల వారిని ఏకం చేసింది. ఒక తాటికి తీసుకొచ్చింది. అలాంటి ఉస్మానియా వర్సిటీకి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సభను నిర్వహించే విషయంలో అనుమతిపై వర్సిటీ కౌన్సిల్ నో చెప్పేసింది.

గడిచిన మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఓయూకు రాహుల్ వస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకునే సమీకరణలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ భారీగా పెరగటం ఖాయమని చెప్పాలి.

ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గడిచిన కొన్నేళ్లలో ఏ రోజు కూడా ఉస్మానియాకు సీఎం కేసీఆర్ వెళ్లింది లేదు. ఆ మాటకు వస్తే విపక్షాలు తరచూ.. దమ్ముంటే సీఎం కేసీఆర్ కానీ.. మంత్రి కేటీఆర్ కానీ ఉస్మానియా వర్సిటీలోకి అడుగు పెట్టే సాహసం చేస్తారా? అని సవాలు విసురుతుంటారు.

ఇంతలా సవాలు విసిరినప్పటికీ టీఆర్ఎస్ నేతలు మాత్రం స్పందించకుండా ఉండటం తరచూ చోటు చేసుకుంటుంది. అలాంటి ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ సభ నిర్వహిస్తే వచ్చే మైలేజీ అంతా ఇంతా కాదు.

అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపు తేవాలన్న పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి.. ఓయూ సభ నుంచి చాలానే కోరుకుంటున్నారు. రాజకీయంగా ఇంత కీలకమైన సభకు తాజాగా ఉస్మానియా వర్సిటీలో ఎలాంటి బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కౌన్సిల్. అంతేకాదు.. తాజాగా వర్సిటీలోకి కెమేరాల్ని కూడా నిషేధిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

మే 6న వరంగల్  వేదికగా రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీనికి హాజరు కానున్న రాహుల్ గాంధీ తర్వాతి రోజున ఉస్మానియా వర్సిటీలో ఏర్పాటు చేసే సభలో పాల్గొనాలని భావించారు. తాజాగా వర్సిటీ కౌన్సిల్ అనుమతికి నో చెప్పటంతో తెలంగాణ కాంగ్రెస్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News