కోవాగ్జిన్ , కోవీషీల్డ్ మిక్సింగ్‌... ఓ బ్యాడ్ ఐడియా

Update: 2021-08-14 02:48 GMT
క‌రోనా క‌ల్లోలానికి చెక్ పెట్టే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల విష‌యంలో ఇటీవ‌ల ఓ సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. అదే ఈ రెండు వ్యాక్సిన‌ మిక్సింగ్‌. వ్యాక్సిన్ల మిక్సింగ్కు సంబంధించిన అధ్యయనానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. త‌మిళ‌నాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై అధ్య‌య‌నం చేప‌ట్ట‌నున్న‌ట్లు నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వీకే పౌల్ తెలిపారు. అయితే, దీనిపై కోవీషీల్డ్-కోవాగ్జిన్ మిక్సింగ్ ను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మస్ సైరస్ పూనావాలా వ్యతిరేకించారు. వ్యాక్సిన్ మిక్సింగ్ ఓ బ్యాడ్ ఐడియా అని తేల్చేశారు.

నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పాల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్ మిక్సింగ్ విష‌యంలో సుమారు 300 మంది వలంటీర్లపై వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో త్వరలో ట్రయల్స్‌ నిర్వహించనున్నామ‌ని తెలిపారు. వ్యాక్సిన్ మిక్సింగ్‌పై స్ట‌డీ చేప‌ట్టాల‌ని జూలై 29న సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ ఓ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను తాజాగా పూనావాల త‌ప్పుప‌ట్టారు.


కోవీషీల్డ్ , కోవాగ్జిన్ డోసులను మిక్స్ లేదా కలపడం చేయాల్సిన అవసరం లేదని పూనావాలా తెలిపారు. ఈ వ్యాక్సిన్ మిక్సింగ్‌లో ఏదైనా పొర‌పాటు జరిగితే ఈ వ్యాక్సిన్ తయారీదారుల మధ్య విమ‌ర్శ‌లు వచ్చే అవకాశముందన్నారు. ఫీల్డ్ ట్రయిల్స్ లో వ్యాక్సిన్ మిక్సింగ్ రుజువు అవ్వలేదని పేర్కొన్న పూనావాలా వ్యాక్సిన్ లను మిక్స్ చేయడం చాలా తప్పు అని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, ఇప్ప‌టికే యూపీలో వ్యాక్సిన్ మిక్సింగ్‌పై స్ట‌డీ చేశారు. అక్క‌డ తొలి డోసు రూపంలో కోవీషీల్డ్‌.. మ‌రో ఆరు వారాల వ్య‌వ‌ధిలో రెండ‌వ డోసుగా కోవాగ్జిన్ ఇచ్చారు. 18 మంది వాలంటీర్ల‌కు మిశ్ర‌మ వ్యాక్సిన్లు ఇచ్చారు. మిక్సింగ్ సుర‌క్షిత‌మే కాదు, ఉత్త‌మ రోగ నిరోధ‌క శ‌క్తి వ‌చ్చిన‌ట్లు ఐసీఎంఆర్ త‌న తొలి స్ట‌డీలో తేల్చింది. అయితే మిశ్ర‌మ టీకాలపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని నిపుణుల క‌మిటీ భావిస్తున్న నేప‌థ్యంలో వెల్లూర్ మెడిక‌ల్ కాలేజీలో మ‌రోసారి ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు.
Tags:    

Similar News