కోవాగ్జిన్ వ్యాక్సిన్ సామర్థ్యానికి.. అది చేస్తున్న పనికి పోలికే లేదట

Update: 2021-03-04 04:30 GMT
లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్లుగా హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇటీవల కాలంలో వచ్చిన సందేహాలు పటాపంచలు అయ్యాయి. ప్రధాని మోడీ ఈ వ్యాక్సిన్ ను వేసుకున్న తర్వాత నుంచి దీనిపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. ఈ టీకా సామర్థ్యం ఎంతన్న విషయానికి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలు బయటకు వచ్చాయి.

కరోనాపై పోరు చేసే ఏ వ్యాక్సిన్ కు కోవాగ్జిన్ తీసిపోదని తాజాగా వచ్చిన ఫలితాల్ని చూస్తే అర్థమవుతుంది. అన్నింటికి మించిన ఆసక్తికర అంశం ఏమంటే.. వేగంగా వ్యాప్తి చెందుతున్న యూకే స్ట్రెయిన్ కరోనాను తమ వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకోగలదని భారత్ బయోటెక్ చెబుతోంది. తమ మూడోదశ ట్రయల్స్ కు సంబంధించిన వివరాల్ని ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసింది.

దేశంలోని 25 ప్రాంతాలకు చెందిన 25,800 మంది వలంటీర్లపై కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్ ప్రారంభించారు. మొత్తం టీంను రెండు బ్యాచులుగా విభజించారు. వారిలో ఒక టీంలోని వారికి కొవాగ్జిన్ టీకాను.. మరో టీంకు ప్లాసిబో ఇచ్చారు. కొద్దిరోజులకు వారిలో 43 మందికి కరోనా సోకింది. ఆ 43 మందిలో 36 మంది ప్లాసిబో గ్రూపు వారు కాగా.. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఏడుగురు. అందరిలోనూ తక్కువ లక్షణాలు కనిపించాయి. మొత్తంగా వ్యాక్సిన్ ప్రభావశీలత 80.6 శాతంగా ఉంది.

మరో విశేషం ఏమంటే.. మన దేశంలో చాలామంది కొవాగ్జిన్ టీకా వేసుకోవటానికి వెనకాడుతుంటే.. ఫ్రాన్స్ మాత్రం కొవాగ్జిన్ టీకాల కొనుగోలుపై ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ రాయబారి భారత బయోటెక్ సీఎండీ క్రిష్ణ ఎల్లాను హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. నలభైకి పైగా దేశాలు తమ వ్యాక్సిన్ మీద ఆసక్తి చూపుతున్నట్లుగా భారత్ బయోటెక్ చెబుతోంది.
Tags:    

Similar News