కరోనా ఇంజెక్షన్.. ఈ 5 రాష్ట్రాలకు పంపిణీ

Update: 2020-06-26 02:30 GMT
కరోనాపై అద్భుతంగా పనిచేస్తున్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ను తొలుత ఐదురాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దీన్ని తయారు చేసి, మార్కెట్ చేయడానికి అనుమతి ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీదారు హెటెరో డ్రగ్ పంపిణీని ప్రారంభించింది. తొలుత కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర ఢిల్లీతో సహా ఐదు రాష్ట్రాలకు 20,000 డోసుల ఇంజెక్షన్ బాటిల్స్ ను పంపారు. వీటి తర్వాత అత్యంత తీవ్రంగా ఉన్న గుజరాత్ , తమిళనాడులకు సరఫరా చేశారు. భారతదేశంలో ‘కోవిఫర్’ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతున్న ఈ ఔషధం మొదటి బ్యాచ్ ను ఫార్మా ఇండస్ట్రీ తయారీ కేంద్రంగా ఉన్న తెలంగాణ కూడా అందుకుంటోంది. హైదరాబాద్‌కు కూడా మొదటి సరుకును ఇదే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెటిరో కంపెనీ సరఫరా చేసింది.

100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ సీసాకు 5,400 రూపాయలు ఖర్చవుతుందని హెటెరో తెలిపింది.. పెద్దలు మరియు పిల్లల రోగులకు సిఫార్సు చేసిన మోతాదులో మొదటి రోజు 200 మి.గ్రా, తరువాత ఐదు రోజుల పాటు 100 మి.గ్రాముల ఇంజెక్షన్ మోతాదు వేయాలని హెటీరో సూచించింది.

ఈ ఇంజెక్షన్ డ్రగ్ ను రెండో బ్యాచ్ లో కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం , గోవాలకు పంపిస్తారు. మూడు నాలుగు వారాల్లో ఈ ఔషధం లక్ష డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈ కంపెనీ ఫార్ములేషన్ ఫెసిలిటీలో ఈ మందును తయారు చేస్తున్నారు. ఈ ఔషధం ఆసుపత్రులు మరియు ప్రభుత్వాల ద్వారా మాత్రమే లభిస్తుందని, రిటైల్ ద్వారా ఇంకా విక్రయించడం లేదని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి వంశీ కృష్ణ బండి తెలిపారు.

"కాలేయ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యం, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలు.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ మందు ఇవ్వవద్దని" అని హెటిరో ఎండీ మీడియాకు తెలిపారు. ఈ డ్రగ్ అసలు తయారీదారు అయిన అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ ఇంక్‌తో హెటిరో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. రెగ్యులేటర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) తీవ్రమైన కరోనా కేసులలో అత్యవసర ఉపయోగం కోసం హెటెరో తయారుచేసిన ఈ మందును ఉపయోగించాలని ఆమోదించింది.

కరోనా రోగులపై ఈ ఇంజెక్షన్ బాగా పనిచేస్తోంది. అమెరికా , దక్షిణ కొరియాలో తీవ్ర అనారోగ్య రోగులకు అత్యవసర ఉపయోగం కోసం వినియోగిస్తున్నారు. జపాన్‌లో ఈ డ్రగ్ పూర్తి ఆమోదం పొందింది.
Tags:    

Similar News