కేసీఆర్ తర్వాత నారాయణే.. కమ్యూనిస్టు ఇలా మారాడేంటి?

Update: 2022-11-11 00:30 GMT
టీఆర్ఎస్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తెలంగాణ గవర్నర్ పై టీఆర్ఎస్ మంత్రులు, కేసీఆర్ ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. బీజేపీ కోవర్ట్ లా గవర్నర్ పనిచేస్తోందంటూ దుయ్యబడుతున్నారు. ఎందుకంటే బిల్లులు, నియామకాలన్నింటిని నిలిపివేసింది తమిళిసై. దీంతో ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రతీకారం తీర్చుకుంటోంది. వారిద్దరికీ అంటే పగ ఉంది. మరీ సీపీఐ నారాయణకు ఎక్కడ కోపం వచ్చిందో కానీ.. కేసీఆర్ కంటే ఎక్కువగా నోరుపారేసుకున్నారు. నిజమైన టీఆర్ఎస్ భక్తుడిలా గవర్నర్ పై విమర్శలు గుప్పించారు.

ప్రధాని మోడీ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని.. గవర్నర్ లతో కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాడని.. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు పార్టీలపై ఈడీ దాడులే లక్ష్యంగా మోడీ పెట్టుకున్నారని విమర్శించారు.

రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలతో నష్టమే తప్ప లాభం లేదని.. రెండు వ్యవస్థలను రద్దు చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని.. బెంగాల్, తమిళనాడు, కేరళలో గవర్నర్ లతో రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు.

గవర్నర్ రాజకీయ ఉపన్యాసం ఇస్తుందని.. లక్ష్మణ రేఖ గవర్నర్ దాటిందని.. గవర్నర్ ఆర్ఎస్ఎస్ రాసిన రాజ్యాంగం చదివిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదివామని.. దర్బార్ పెట్టే హక్కు నీకు ఎక్కడిది? నువ్వు బీజేపీ కార్యకర్తవా? తమిళనాడు బీజేపీలో పోటీచేసి ఓడిపోయావు.. యూనివర్సిటీ బిల్లులు ఆపే హక్కు గవర్నర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

మొత్తంగా గవర్నర్ నే సీపీఐ నారాయణ బెదిరించేశారు. హద్దుల్లో ఉంటే గౌరవం ఉంటుందని.. హద్దులు దాటితే గౌరవం ఉండదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు గవర్నర్ అంటూ నారాయణ తీవ్ర స్తాయిలో నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ను మించి గవర్నర్ పై పడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News