వెంకయ్యనాయుడ్ని ఏపీలో తిరగనివ్వరంట

Update: 2015-08-12 04:31 GMT
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో నాటి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ ఎస్ నేతల నోటి వెంట ఒక మాట తరచూ వచ్చేది. తెలంగాణ సాధన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తెలంగాణ సాధన సాకారం కాకుండా అడ్డుకునే వారితో పాటు.. తెలంగాణ సాధన అంశం పట్టని వారిని సైతం తెలంగాణలో అడ్డుకుంటామని.. వారిని తిరగనీయం అంటూ వ్యాఖ్యలు చేసేవారు.

మొదట్లో ఇదో రాజకీయ ప్రచార స్టంట్ గా భావించేవారు. కానీ.. రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఇలాంటి భావన రావటమే కాదు.. ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు.. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణ సాధన విషయంలో ఒకే నిర్ణయం తీసుకునేలా చేశాయి. తెలంగాణకు సై అంటే తప్ప తాము తెలంగాణ సమాజంలో తిరగలేమన్న మాటను నేతలు పదే పదే ప్రస్తావించేవారు.

ఇప్పుడు ఇలాంటి మాటలే ఏపీలోనూ మొదలయ్యాయి. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. మళ్లీ ఆ ఊసే పట్టనట్లుగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై సీపీఐ నేత నారాయణ తాజాగా హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోని పక్షంలో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ లో తిరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై ఉద్యమాని మరింత ఉధృతం చేస్తామని.. ప్రత్యేక హోదాను సాధిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే నాటికి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల పట్ల విపరీతమైన అసంతృప్తితో ఉన్న సీమాంధ్రులు.. సీపీఐ నేత చెప్పినట్లుగా వెంకయ్యనాయుడ్ని ఏపీలో తిరగకుండా అడ్డకుంటారా? అది సాధ్యమేనా..?
Tags:    

Similar News